టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు

టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు

india-victory

చారిత్రక పింక్‌ బాల్‌ డే అండ్ నైట్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 46 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా.. కొద్దిసేపటికే ఇన్నింగ్స్ ముగించింది. బుల్లెట్‌ బంతులతో చెలరేగిన భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు, ఇషాంత్ నాలుగు వికెట్లు తీసుకున్నారు. దీంతో రెండు టెస్టుల సీరిస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ విక్టరీని సొంతం చేసుకుంది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. బంగ్లాదేశ్‌ మరో 43 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మదుల్లా రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగాడు. మొత్తంగా ఈ టెస్టులో 9 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని ఎనిమిది వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 347/9 వద్ద డిక్లేర్డ్‌ చేయగా, బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు చాపచుట్టేసింది.

ఈ టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌ విజయం సాధించి ఆ ఫీట్‌ను నమోదు చేసిన తొలి జట్టుగా నయా రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక జట్టు ఇలా వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడం ఇదే మొదటిసారి. బంగ్లాపై రెండు, దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విక్టరీలు సాధించింది. మరోవైపు స్వదేశంలో వరుసగా 12వ సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. 11 టెస్టు సిరీస్ విక్టరీలతో ఉన్న ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది విరాట్‌ సేన.

Tags

Read MoreRead Less
Next Story