ఖమ్మం ఆస్పత్రిలో శిశువు అపహరణ.. పోలీసుల గాలింపు..

ఖమ్మం ఆస్పత్రిలో శిశువు అపహరణ.. పోలీసుల గాలింపు..

baby

ఆమె ఎవరో తెలియదు.. నమ్మకంగా మెలిగింది.. సాయం చేస్తోందని వారూ సంబరపడ్డారు.. కానీ, ఆ సాయం వెనుక కుట్రను ఊహించలేకపోయారు. ఫలితం కన్నపేగు ముడి తెగిపోయింది. తల్లి పొత్తిళ్లలో పసిబిడ్డ మాయమైంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసిన నవజాత శిశువు మిస్సింగ్‌ కేసును పోలీసులు కూడా సవాల్‌ తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ ద్వారా మాయలేడీని పట్టుకునే పనిలో ఉన్నారు.

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో శిశువు మాయం ఘటన కలకలం రేపుతోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పసికందును ఎత్తుకెళ్లిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెతోపాటు గ్యాంగ్‌ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవికి 17రోజుల క్రితం పాప జన్మించింది. శిశువు అనారోగ్యంతో ఉండటంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. దీంతో రమాదేవి తల్లిని వెంటెబట్టుకుని ఈనెల 10న ఆస్పత్రికి వెళ్లింది. పసికందును ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో చేర్పించింది. ఆరోగ్యం కుదుట పడటంతో ఈనెల 20న సాధారణ వార్డుకు షిఫ్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం 6గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ రమాదేవి దగ్గరకు వచ్చింది. వారితో నమ్మకంగా మాట్లాడి శిశువుకు పాలు పట్టించింది. ఆ తర్వాత బిడ్డను ఇంజెక్షన్‌ విభాగానికి తీసుకెళ్లి సూది మందు వేయించి తీసుకొచ్చింది. నమ్మకంగా ఉండటంతో రమాదేవి కూడా సంతోష పడింది. కానీ, ఆ సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. నమ్మకంగా ఉంటూనే పసికందును అపహరించుకెళ్లింది ఆ మహిళ. బిడ్డ కనిపించకుండా పోవడంతో తల్లి రమాదేవి గుండె తల్లడిల్లిపోయింది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఓ ముఠా హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళ ఆస్పత్రి బయట ఓ వ్యక్తిని కలిసినట్లుగా సీసీ ఫుటేజ్‌ ద్వారా తెలుసుకున్నారు. అతనితో మాట్లాడిన తర్వాత పాపతో సహా మరో వ్యక్తితో కలిసి సదరు మహిళ బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు. శిశువు అపహరణ వెనుక ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈకేసులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ బంధువులే ఈ పనిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని రోగుల బంధువులంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో శిశువులకు వైద్య సేవలందించే ఎస్‌ఎన్‌సీయూ విభాగం ఎంతో కీలకమైనది. ఇక్కడ ప్రతీ విభాగానికి ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్‌ఎన్‌సీయూకి మాత్రం కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించకుండా మొద్దు నిద్రపోతూ సీసీ కెమెరాలకు చిక్కారు. శిశువు అదృశ్యం జరిగిన సమయంలోనూ ఇదే పరిస్థితిని అధికారులు గుర్తించారు. సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు శిశువు మాయం ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story