ఆర్టీసీ భవితవ్యం తేల్చనున్న కేబినెట్ భేటీ..

ఆర్టీసీ భవితవ్యం తేల్చనున్న కేబినెట్ భేటీ..

tss

తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం గురువారం తేలనుంది. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 52 రోజులు పాటు సమ్మె కొనసాగించి.. చివరికి బేషరతుగా సమ్మె విరమించిన కార్మికులను ప్రభుత్వం ఏం చేయబోతోంది? వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటారా? లేక కఠినంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్నలకు మంత్రి వర్గ సమావేశంలో సమాధానాలు లభించనున్నాయి. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరుతామంటూ మూడు రోజులుగా డిపోలకు చేరుకుంటున్నా.. ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ భేటీపైనే అందరి దృష్టి నెలకొంది.

కేబినెట్‌ సమావేశంలో తెలంగాణలో ఆర్టీసీ మనుగడపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదు వేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర రవాణా చట్టం కూడా దీనికి పూర్తి వెసులుబాటు ఇవ్వడం.. హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణపై అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో గురువారం జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో దీనిపై సుధీర్ఘంగా చర్చ జరగనుంది. ఒకవేళ ముందుగా అనుకున్నట్లుగా రూట్ల ప్రైవైటీకరణను అమలు చేయాలని నిర్ణయిస్తే రవాణాశాఖ వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి రవాణాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు కాకుండా కొంతకాలం తర్వాతే ముందుకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు సీఎం ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేబినెట్‌లో లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైకోర్టు సూచన మేరకు కార్మికుల సమ్మెకు సంబంధించిన కేసును లేబర్‌ కోర్టుకు బదిలీ చేసే అంశంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.

ఒకవేళ 5 వేల 100 ప్రైవేటు బస్సులు రంగంలోకి దిగితే ఆర్టీసీ సగానికి సగం కుంచించుకుపోనుంది. ప్రస్తుతం ఉన్న రూట్ల ప్రకారం దాని పరిధిలో 5 వేల 300 బస్సులు మాత్రమే మిగులుతాయి. ప్రస్తుతం ఉన్న 49 వేల 700 మంది కార్మికుల్లో కనీసం 20 వేల మంది మిగిలిపోతారు. వారిని కచ్చితంగా వీఆర్‌ఎస్‌ ద్వారానో, సీఆర్‌ఎస్‌ ద్వారానో తప్పించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో 50 ఏళ్లు పైబడిన వారిని తప్పించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమలు చేయాలంటే కనీసం 5 వేల కోట్లు అవసరమని అధికారులు లెక్కలేశారు. ఇంత మొత్తం భరించడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారనుంది. అయితే వచ్చే నాలుగైదేళ్లలో భారీ సంఖ్యలో కార్మికులు రిటైర్‌ అవుతుండటంతో...అప్పటివరకు ఈ ప్రక్రియ ఆగితే ప్రభుత్వానికి వీఆర్‌ఎస్‌ బాధ ఉండదని భావిస్తున్నారు.

ఆర్టీసీ ఆదీనంలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. వాటిని అమ్మితేగానీ వీఆర్‌ఎస్‌ అమలుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వానికి సమకూరే అవకాశం లేదు. ఆర్టీసీకి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు పూర్తి వివరాలను సిద్ధం చేశారు. మంత్రి వర్గంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక టికెట్ల ధరలను ఏటా పెంచేలా ఓ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు పైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు కార్మికులను ఒకవేళ విధుల్లోకి చేర్చుకుంటే భవిష్యత్తులో సమ్మెలు, యూనియన్‌ సభ్యత్వం లేకుండా పకడ్బందీ షరతులు విధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై భేటీలో తేలకపోతే.. సమగ్ర నివేదిక కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్‌.

ఆర్టీసీనే ప్రధాన ఎజెండగా సాగే కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు వేతన సవరణపై కూడా చర్చ ఉండే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది బడ్జెట్‌లోనే ఫిట్‌మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అటు తెలంగాణలో హైకోర్టు ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story