ప్రియాంకారెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు

ప్రియాంకారెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు

SAD

హైదరాబాద్ శివార్లలో జరిగిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య తీవ్ర సంచలనంగా మారింది. ఆమెను రేప్‌ చేసి దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎలాంటి అనవాళ్లు దొరక్కుండా ఉండేందుకే కాల్చిచంపినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన కీలక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే 10 స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఘటన జరిగిన మార్గంలో ఉన్న సీసీఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆసమయంలో అటుగా వెళ్లిన ప్రతి వాహనం వివరాల్ని సేకరిస్తున్నారు..

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలోని కొల్లూరులో ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తోంది. బుధవారం శంషాబాద్ సమీపంలో ఉన్న నక్షత్ర విల్లాలోని ఇంటి నుంచి బయల్దేరిన ప్రియాంక.. శంషాబాద్ ORR టోల్‌గేట్ దగ్గర తన స్కూటీని పార్క్ చేసింది. అక్కడి నుంచి కార్‌లో గచ్చిబౌలిలోని స్కిన్ డాక్టర్ వద్దకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాత్రి 9 గంటల ప్రాంతంలో శంషాబాద్ టోల్‌గేట్ వద్దకు చేరింది. స్కూటర్ పార్క్‌చేసిన ప్రాంతానికి వెళ్లగా అది పంక్చర్ అయింది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చారు. మేడం బండి పంక్చర్ అయిందని మాటలు కలిపారు. పర్లేదు మధ్యలో రిపేర్‌ చేయిస్తానని చెప్పినప్పటికీ విన్లేదు. మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడుతారంటూ స్కూటర్‌ను ఓ యువకుడికి ఇచ్చి పంపించారు. ఎక్కడా పంక్చర్ షాపులు లేవంటూ కాసేపటికే అతడు తిరిగొచ్చేశాడు. దీంతో మరో చోటుకు వెళ్లాలని పంపించాడా వ్యక్తి..

అప్పటికే రాత్రి 9 దాటింది. పైగా హైవే ప్రాంతం. పక్కనే లారీలు ఆగి ఉండటంతో ప్రియాంక రెడ్డికి భయమేసింది. ఆ సమయంలో రోడ్డుపై పెద్దగా వాహనాల రాకపోకలు కూడా లేవు. కొందరు లారీ డ్రైవర్లు కూడా అక్కడే ఉండడంతో టెన్షన్‌ పడిపోయింది. ఇంటికి ఫోన్ చేసి చెల్లెలితో మాట్లాడింది. అక్కడి పరిస్థితిని క్లియర్‌గా వివరించింది. ఇక్కడ చాలా మంది ఉన్నారని.. వారిని చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. బైక్‌ను తీసుకెళ్లారని.. వాళ్లు వచ్చేవరకు తనతో మాట్లాడాలంటూ చెల్లిని బతిమిలాడింది. బండి వదిలేసి పక్కనే ఉన్న టోల్‌గేట్ దగ్గరకు రావాలని సలహా ఇచ్చింది చెల్లెలు. మళ్లీ రేపు బండి తీసుకోవడం ఇబ్బంది అవుతుందంటూ అక్కడే ఉండిపోయింది ప్రియాంక రెడ్డి. అంతే అక్కడితో కాల్ కట్‌ అయిపోయింది.

ఆ తర్వాత ప్రియాంక రెడ్డి ఆచూకీ తెలియలేదు.. ఫోన్ చేసినా స్విచ్‌ ఆఫ్ వచ్చింది. ఇంట్లో వాళ్లు భయపడిపోయారు. అర్దరాత్రి దాటిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే గురువారం ఉదయం శవమైపోయింది ప్రియాంక రెడ్డి. పూర్తిగా కాలిపోయిన ఆమె డెడ్‌బాడీని.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి జాతీయ రహదారి కింద ఉన్న అండర్‌పాస్‌ వద్ద గుర్తించారు. మెడలోని లాకెట్, చున్నీ ఆధారంగా ప్రియాంక రెడ్డిని ఆమె చెల్లెలు గుర్తించారు.

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు 10 బృందాలను రంగంలోకి దించారు. దారిలో ఆమెను ఆపి స్కూటీ పంక్చర్ అయ్యిందని చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాగే ఆ దారిలో ఉన్న పంక్చర్ షాప్ వాళ్లను ప్రశ్నించారు.

అయితే ప్రియాంకారెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శంషాబాద్ టోల్‌గేట్‌కు... ప్రియంక డెడ్‌బాడీ దొరికిన స్థలానికి మధ్య దాదాపు 26 కిలోమీటర్ల దూరం ఉంది. శంషాబాద్‌ టోల్‌గేట్‌ దగ్గరే ఆమెను చంపేసి.. ఇక్కడికి తీసుకొచ్చి కాల్చేశారా అన్నది తేలాల్సి ఉంది.. అటు ఘటనా స్థలానికి సమీపంలోనే ప్రియాంక స్కూటర్‌ను కూడా గుర్తించారు. ఇక ఇది లారీ డ్రైవర్ల పనా.. లేక తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అన్నది కూడా విచారణలో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story