నీళ్లే ఆమెకు శత్రువు.. నెలకు రెండు సార్లే స్నానం

నీళ్లే ఆమెకు శత్రువు.. నెలకు రెండు సార్లే స్నానం

water-allergy

సరిపడా నీళ్లు తాగకపోతే డీ హైడ్రేషన్ వస్తుంది.. రెండు పూటలా స్నానం చేయకపోతే అలర్జీ వస్తుంది.. వెరసి శుభ్రంగా ఉండకపోతే రోగాలొస్తాయి.. ఏది తినాలన్నా తినే ముందు చేతులు కడుక్కోవాలి.. తిన్న తరువాత నీళ్లు తాగాలి. ఇది నీళ్ల గురించిన నిజం. అదేం ఖర్మో ఆమెకు నీళ్లే అలర్జీ. కూతుర్ని చూసి కన్నీళ్లు పెడుతున్నారు డాక్టర్లైన తల్లిదండ్రులు. ఫుడ్ అలర్జీ ఉంటే పడనిదేదో తెలుసుకుని మానేయొచ్చు. డస్ట్ అలర్జీ అయితే ముక్కుకి మాస్క్ కట్టుకోవచ్చు. బాగా దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లైనా తాగకపోతే ప్రాణం గుటుక్కుమంటుంది. మరి అలాంటిది ఆమె నీళ్లు తాగకుండా ఎలా బతుకుతోంది. పొద్దున్న లేస్తే నీటితో పని.. కొంత ఆశ్చర్యం.. మరి కొంత ఆసక్తి ఇంతకీ ఆమె ఎవరు, ఆమె గురించి తెలుసుకోవాలని.. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి కేసులు 100 కంటే తక్కువే వుంటాయని చెబుతున్నారు వైద్యులు.

కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హన్సెన్ స్మిత్ తనకు 8 ఏళ్లు ఉన్నప్పుడు ఒంటి మీద దద్దుర్లు వచ్చాయని అమ్మానాన్న స్కిన్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. స్నానానికి ఉపయోగించే సబ్బు ఏమైనా పడట్లేదేమోనని సోప్ మార్చి చూడమన్నారు. అయినా అలర్జీ తగ్గలేదు. మళ్లీ వెళ్లారు హాస్పిటల్‌కి. ఈసారి మరేదో మార్చమన్నారు. ఎంతకీ మార్పు రాలేదు. ఒళ్లంతా దురదలు, దద్దుర్లు. ఒకటే మంట. డాక్టర్లకు కూడా అంతు పట్టని ఆ వ్యాధి ఏంటా అని ఆందోళన చెందారు అమ్మానాన్న. డాక్టర్లం అయి ఉండి కూడా కూతురి బాధను తీర్చలేకపోతున్నామని బెంగ. ఆమె గురించిన అన్ని వివరాలు తీసుకుని సీరియస్‌గా పరిశోధన సాగించారు వైద్యులు. నీళ్లే ఆమె అలర్జీకి కారణమని తేల్చేశారు. ఈ వ్యాధిని 'ఆక్వాజెనిక్ ఆర్టికేరియా' అని అంటారని చెప్పారు.

ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఏడుద్దామంటే కన్నీళ్లు కూడా కార్చకూడదు. ఆ నీటి బొట్టు ఒంటి మీద పడితే వెంటనే దురద, మంట. యాసిడ్ పడినట్లు శరీరంపై బొబ్బర్లు. చెమట పట్టకూడదు.. చెమట పట్టింది కదా అని స్నానం చేయకూడదు. పొరపాటున నీళ్లు తగిలితే వెంటనే జ్వరం వచ్చేస్తుంది. వ్యాధి నివారణ కోసం రోజుకి 9 రకాల మాత్రలు వేసుకుంటుంది. భయపడుతూనే నెలకు రెండు సార్లు స్నానం చేయడానికి ప్రయత్నిస్తుంది. నీటి శాలం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహారం ఏదైనా తీసుకున్నా నోరు పుండులా మారిపోతుంది. నీళ్లు తాగితే నాలుకపై పుండ్లు వస్తాయి. తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెస్సా ఇప్పుడు యూనివర్సిటీ హోల్డర్.

Read MoreRead Less
Next Story