తాజా వార్తలు

ఆర్టీసీ కార్మికులకు తీపికబురు

ఆర్టీసీ కార్మికులకు తీపికబురు
X

ww

55 రోజుల సుదీర్ఘ సమ్మె. ఉందో లేదో తేలియని ఉద్యోగం. రోజులు గడుస్తున్న కొద్ది ఉత్కంఠ. వీటన్నింటికి తెరదించుతూ ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలేనని.. వారిని కష్టపెట్టడం తమ లక్ష్యం కాదన్న సీఎం.. కార్మికులు హ్యాపీగా విధుల్లో చేరొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలాంటి షరతులు పెట్టబోమన్నారు.

సీఎం ప్రటకనతో శుక్రవారం నుంచి కార్మికులు విధుల్లో చేరారు. చాలా రోజుల తర్వాత మళ్లీ డిపోల దగ్గర కోలాహలం కనిపించింది. అయితే.. కార్మికులకు శుభవార్త చెబుతూనే యూనియన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. యూనియన్ల ఉన్మాదంలో కార్మికులు చిక్కుకోవద్దని సూచించారు. యూనియన్లు లేకున్నా కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం వర్కర్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకునేందుకు అన్ని డిపోల నుంచి నలుగురైదుగురు చొప్పున పిలిపించి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక ఆర్టీసీ మనుగడ కోసం చేపడుతున్న ప్రక్షాళన చర్యల్లో తొలి భారం ప్రయాణికులపై పడింది. నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసికి ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున పెంచినా.. దాదాపు 750 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందన్నారు. దీనికితోడు ప్రభుత్వం తక్షణ సాయం కింద 100 కోట్లు విడుదల చేస్తుందన్నారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో తాము అనుకున్నది వేరని.. బయట మరోలా ప్రచారం జరుగుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి సంపూర్ణ అవకాశం ఉందని.. కానీ, మాకు ఆ ఆలోచనే లేదని అన్నారు. వీఆర్ఎస్ తీసుకున్న కార్మికులకే ప్రైవేటీకరణ ఫలాలు అందాలని భావించినట్లు వివరించారు.

సమ్మె కాలంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. కుటుంబంలో ఒకరికి వారి అర్హతను బట్టి ఆర్టీసీగానీ, ప్రభుత్వంలోగానీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇక ఆర్టీసీ విషయంలో ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. నూతన రవాణ చట్టానికి ఢిల్లీలో ఓటేసిన ఎంపీలే రాష్ట్రంలో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. దాదాపు రూ.22వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తామని.. అలాగే ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుగ మీ వంతుకు రూ.5వేల కోట్లు ఇవ్వండని కేంద్రాన్ని అడుగుతామన్నారు. ఇన్ని రోజులుగా ఆర్టీసీపై ప్రేమ ఒలకబోసిన బీజేపీ నాయకులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES