నాలుగు రోజులు గడిచినా.. దొరకని చిన్నారి ఆచూకీ

నాలుగు రోజులు గడిచినా.. దొరకని చిన్నారి ఆచూకీ
X

baby

ఖమ్మంలో పురిటిబిడ్డ అపహరణకు గురై నాలుగు రోజులు అవుతున్నా.. ఇంత వరకూ ఆచూకీ తెలియడం లేదు. సీసీ ఫుటేజ్‌లో కిడ్నాపర్ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయినా.. కేసు ముందుకు కదలడం లేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కిడ్నాప్‌తో మరో ఇద్దరికి సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పాపను తల్లి ఒడికి చేరుస్తామని అంటున్నారు. మరోసారి పాప తల్లిదండ్రులతో మాట్లాడి ఫుటేజ్‌లో ఉన్న మహిళ ఎలా వార్డులోకి వచ్చింది.. మాయమాటలతో బిడ్డను ఎలా ఎత్తుకెళ్లిందనే వివరాలపై ఆరా తీశారు.

సత్తుపల్లికి సమీపంలోని కందుకూరుకు చెందిన రమాదేవి వేంసూర్ ఆస్పత్రిలో 15 రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. ఐతే.. అనారోగ్యంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలోనే కిడ్నాపర్ పాపను ఎత్తుకెళ్లింది. పాలు పట్టిస్తానంటూ తెల్లవారుజామున ఐదున్నరకు బిడ్డను తీసుకున్న మహిళ.. క్షణాల్లోనే అక్కడి నుంచి మాయమైపోవడంతో రమాదేవి షాక్ తింది. ఆస్పత్రి సిబ్బందికి చెప్పి, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే గాలింపు చేపట్టినా.. పాప ఆచూకీ తెలియలేదు. అసలే అనారోగ్యంతో ఉన్న చిన్నారికి 4 రోజులుగా వైద్యం అందకపోవడంతో ఏమై ఉంటుందోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. పోలీసులు త్వరగా కిడ్నాపర్‌ను పట్టుకుని తమ బిడ్డను తమకు అప్పగించాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES