సీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ కార్మికుల సమావేశం

సీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ కార్మికుల సమావేశం

kcr

ప్రభుత్వ సూచనలతో విధుల్లో చేరిన కార్మికులు సీఎం కేసీఆర్‌తో సమావేశానికి రెడీ అవుతున్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు ఉండగా.. ఒక్కో డిపో నుంచి ఐదుగురు కార్మికులు సమావేశానికి హాజరవుతారు.. వీరిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలని, అలాగే అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీని ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కార్మికులంతా ప్రగతిభవన్‌కు తరలిరానున్నారు.

లంచ్‌ తర్వాత కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా మాట్లాడతారు.. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ మంచి చెడుల గురించి, సంస్థను మరింత పటిష్ట పరిచి అభివృద్ధి చేసుకోవాలంటే చేపట్టాల్సిన కార్యాచరణను వారితో చర్చించనున్నారు. ఇన్నాళ్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ పురోగతికి, నాణ్యమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.

ఇక పరిష్కారానికి నోచుకున్న సమస్యలను అప్పటికప్పుడే క్లియర్‌ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ల స్థానంలో సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్‌.. ఆ అంశంపైనా వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమావేశంలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులను, బస్సుల గణాంకాలతోపాటు అన్ని వివరాలతో కూడిన పుస్తకాలకు కార్మికులకు ఇవ్వనున్నారు.

కార్మికులతో సమావేశం నేపథ్యంలో వారితో ఏయే అంశాలపై చర్చించాలి..? సంస్థ, అధికారుల నుంచి.. అలాగే ప్రభుత్వం నుంచి కార్మికులు ఆశించే అంశాలు ఏంటి..? అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాలిక చర్యలకు సంబంధించి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశంపై చర్చించారు.

మరోవైపు ఆదివారం జరిగే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులను ఆదుకోవాలని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. భారత రాజ్యాంగం కార్మికుల కోసం రాసిన హక్కుల ప్రకారమే కార్మిక సంఘాలు నడుచుకుంటున్నాయని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story