తల్లీబిడ్డకు పెట్రోలు పోసి నిప్పంటించిన దుండగులు

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిబిడ్డను హత్యచేసి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఒంగోల్ సమీపంలో జరిగింది. పాప వయసు ఒకటిన్నర సంవత్సరాలు మహిళకు 25 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి సంతనూతలపాడు మండలం పరిధిలోని పెద్దకోత్తపల్లి పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులకు అనుమానం వచ్చి సంఘటన స్థలానికి వచ్చి చూడగా పింక్ చీరలో ఉన్న గుర్తుతెలియని మహిళ, చిన్నపాప మృతదేహాలకు నిప్పంటించినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, రక్తపు మరకలు, కత్తి, పెట్రోల్ తీసుకెళ్లేందుకు ఉపయోగించే ఖాళీ సీసాతో ఒక బండ రాయిని కనుగొన్నారు. దుండగులు ఎవరో మహిళను ఆమె కూతురిని బండరాయితో మోదీ హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం లేదంటే కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ డబుల్ హత్య జరిగివుండొచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది. ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ కూడా రాత్రిపూట సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com