అంతర్జాతీయం

మరో గురుతర బాధ్యతను స్వీకరిస్తున్న సుందర్ పిచాయ్.. అల్ఫాబెట్ సీఈఓగా తమిళ తంబి

మరో గురుతర బాధ్యతను స్వీకరిస్తున్న సుందర్ పిచాయ్.. అల్ఫాబెట్ సీఈఓగా తమిళ తంబి
X

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అత్యున్నత బాధ్యతలను చేపడుతున్నారు. గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 21 సంవత్సరాల కిందట గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను స్ధాపించిన పేజ్‌, బ్రిన్‌లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజంగా మారనున్నారు.

టెక్నాలజీపై వినియోగదారుల్లో, గూగుల్ ఉద్యోగుల్లో, భాగస్వాముల్లో ప్యాషన్ ను సుందర్ పిచాయ్ తీసుకువచ్చాడని..గూగుల్ ను, అల్ఫాబెట్ ను భవిష్యత్తు వైపు నడిపించడానికి అంత కంటే సమర్ధుడు మరొకరు లేరు అనే ఉద్దేశంతోనే సుందర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అల్ఫాబెట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లోనే ఒకటి. 2018లో అల్ఫాబెట్ లాభం 30 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయం 136.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అల్ఫాబెట్ గ్రూప్‌లోఉన్న లైఫ్ సైన్సెస్ గ్రూపు వెరిలై, బయోటెక్ ఆపరేషన్ సంస్థ కాలికో వంటివి ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. గూగుల్ లాభాలను తెచ్చి.. పెట్టుబడులుగా పెట్టినప్పటికీ ఈ సంస్థలు ముందుకు కదలడం లేదన్నారు. మరి సుందర్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి సంస్థల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

పిచాయ్ ఇకపై సెర్చ్, వ్యాపార ప్రకటనలు, మాప్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్, ఆన్లైన్ వీడియో తదితర విభాగాలతో పాటు డ్రోన్ డెలివరీలు, ఇంటర్నెట్ బీమింగ్ బలూన్స్ వంటి వాటికీ ఏకైక అధిపతి కానున్నారు. రెండు దశాబ్దాల కిందట గూగుల్ ను ఏర్పాటు చేసిన పేజ్, బ్రిన్ లు 2015లో పిచాయ్ ను గూగుల్ కు సీఈఓగా చేసి.. వారు అల్ఫాబెట్‌లోకి వెళ్లారు. ఇప్పుడు రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్రను మరింత పరిమితం చేసుకున్నారు. కాగా, తాజా మార్పులతో అల్ఫాబెట్ నిర్మాణంలో ఎటువంటి మార్పూ ఉండదని పిచాయ్ స్పష్టం చేశారు.

ఇప్పటికే ఇదే కంపెనీలో పలు బాధ్యతలను నిర్వహించారు సుందర్‌ పిచాయ్‌. క్రోమ్ బాధ్యతలతో పాటు, గూగుల్ ప్రోడక్ట్ చీఫ్, యాండ్రాయిడ్ అధిపతిగా వ్యవహరించారు. గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక అంతా తానై నిర్వహించారు. ఆయన నాయకత్వంలో గూగుల్ వ్యాపార వృద్ధి కొనసాగింది. హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ లోకి విస్తరించింది. తమిళనాడులోని మధురైలో పుట్టిన పిచాయ్, వార్టన్ బిజినెస్ స్కూల్ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.

Next Story

RELATED STORIES