తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ మృతుల డెడ్‌బాడీలను పరిశీలించిన మానవ హక్కుల సంఘం

ఎన్‌కౌంటర్‌ మృతుల డెడ్‌బాడీలను పరిశీలించిన మానవ హక్కుల సంఘం
X

nhrc-1

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘం విచారణ ప్రారంభమైంది. మొదట మహబూబ్‌ నగర్‌ ఆస్పత్రి.. తరువాత చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ప్లేస్‌కు వెళ్లి అన్ని అంశాలను నిశితంగా పరిశీలించింది. ఈ బృందం ఎలా రియాక్ట్‌ అవుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు పరిశీలించేందుకు హైదరాబాద్‌కు చేరుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం మొదట శంషాబాద్‌కు చేరుకుంది. అక్కడ నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ఏడుగురు సభ్యుల NHRC బృందం.. ఎన్‌కౌంటర్‌ మృతుల డెడ్‌బాడీలను పరిశీలించింది. మృతదేహాలపై దెబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయి. తూటాలు ఎక్కడ తగిలాయన్నది నిశితంగా పరిశీలించారు బృందం సభ్యులు. పోస్ట్‌మార్టంపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.

మహబూబ్‌నగర్‌ నుంచి NHRC బృంద సభ్యులు నేరుగా షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లికి వెళ్లారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను.. తమకు అనుమానం వచ్చిన అన్ని విషాయాల పైనా నేరుగా ప్రశ్నలు సంధించారు సభ్యులు..

ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి మృతదేహాలను ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకూ భద్రపరచాలని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం వరకు మృతదేహాలను ఇక్కడ ఉంచడం కూడా పోలీసులకు సవాల్‌గా మారింది.

ఇటు ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు సిబ్బందిపై FIR నమోదు చేయాలని కోరుతూ ఇద్దరు అడ్వొకేట్లు GS మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నవారిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు.

మరోవైపు నిందితుల దాడిలో గాయపడిన నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌ గౌడ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వాళ్లిద్దరికీ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES