సీఎం యోగి తమ ఇంటికి రావాలని ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబం డిమాండ్‌

సీఎం యోగి తమ ఇంటికి రావాలని ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబం డిమాండ్‌

unnav

దారుణ అత్యాచారానికి గురై.. దుండగుల చేతిలో 90 శాతం కాలిన గాయాలతో కన్నుమూసిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు ఉద్రిక్తతల మధ్య జరిగాయి. సీఎం యోగి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులే బాధితురాలి మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు లక్నో వచ్చి సీఎంను కలవాల్సిందిగా బాధితురాలి చెల్లికి ఉన్నతాధికారులు సూచించినప్పటికీ ఆమె నిరాకరించింది. సీఎం యోగీనే తమ ఇంటి వద్దకు రావాలని డిమాండ్ చేసింది.

బాధితురాలి అంత్యక్రియలు జరిగినపుడు.. ఆమె తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు అన్యాయం జరిగిందన్నారు. దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్లో చంపేసిన విధంగానే.. తన కూతురిపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన వారినీ శిక్షించాలని ఉన్నావ్‌ మృతురాలి తండ్రి డిమాండ్‌ చేశారు. తనకి ఏ సాయమూ అక్కర్లేదనీ న్యాయం మాత్రమే కావాలంటున్నారు.

2018 డిసెంబరులో ఉన్నావ్‌కు చెందిన బాధితురాలిపై నిందితులు అత్యాచారం చేశారు. భారీ ఆందోళనల అనంతరం మార్చిలో FIR నమోదు చేయగా.. 10 రోజుల కిందటే ప్రధాన నిందితుడు సుభామ్‌ బెయిలుపై బయటకు వచ్చాడు. గత గురువారం తన కేసు విషయమై స్వగ్రామం నుంచి రాయ్‌బరేలీ వెళుతున్న బాధితురాలిని.. కాపుకాసి ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు దుర్మార్గులు. మంటల్లో చిక్కుకుని 112కి ఫోన్‌ చేసి రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారామె. అక్కడి నుంచి తాను స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కాలిన గాయాలతో లక్నో ఆసుపత్రికి... అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి కన్నుమూశారామె. తనపై పెట్రోలు పోసి నిప్పంటించిన వారిలో.. అత్యాచార నిందితులు ఇద్దరు ఉన్నారని మరణశయ్యపై వాంగ్మూలం కూడా ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

నిర్భయ తరువాత ఉన్నావ్‌ ఘటనపై ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. రాజకీయాలకతీతంగా మహిళలు, యువతులు, రాజకీయనాయకులు గొంతు విప్పారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఉన్నావ్‌ ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఉన్నావ్‌ బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు అట్టుడికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘటనకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విధాన్‌ భవన్‌ వెలుపల ధర్నా చేశారు. ఓ యువతికి రక్షణ కల్పించలేని రోజుని బ్లాక్‌డేగా వర్ణించారు. ఘటనపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి తీవ్రంగా స్పందించారు. సత్వర న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతికి నష్టపరిహారంగా యూపీ ప్రభుత్వం రూ.25 లక్షలు ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద ఇల్లు ఇస్తామని కూడా పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా దోషులెవ్వరైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. తక్షణ పరిష్కారం కోసం కేసుని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకి అప్పగించారు. అయితే.. బాధితురాలు తల్లిదండ్రులు మాత్రం ఆర్థిక సాయం అవసరంలేదని తమ కూతురిని కడతేర్చిన వారికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story