అమ్మ మనసు.. ఆట మధ్యలో బిడ్డకు పాలు..

అమ్మ మనసు.. ఆట మధ్యలో బిడ్డకు పాలు..

mother-love

దేవుడు అన్ని చోట్లా తానుండలేక అమ్మను సృష్టించాడంటారు. ఎన్ని పన్లున్నా, ఏం చేస్తున్నా అమ్మకి మాత్రమే తెలుస్తుంది బిడ్డ ఆకలి. క్రీడా మైదానంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. తనదే పై చేయి కావాలి. గేమ్‌లో విజేతగా గెలిచిన ఆనందంకంటే బిడ్డ ఆకలిని తీర్చిన ఆనందమే ఆ తల్లికి ఎక్కువ వుంటుంది. అదే తల్లి ప్రేమకు సరైన నిదర్శనం. మిజోరం రాష్ట్రానికి చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లువాంగీ.. తుయికుం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు వాంగీ తన ఏడు నెలల చిన్నారిని కూడా తీసుకుని వెళ్లింది. తల్లి పాల గొప్పతనం తెలిసిన తల్లి కనుక బిడ్డకు తన పాలతోనే కడుపు నింపుతోంది.

ఆటకు మద్యలో బ్రేక్ వచ్చినప్పుడు అమ్మ మనసు ఆరాట పడింది. ఆకలితో ఏడుస్తున్న బిడ్డను హృదయానికి హత్తుకుని కడుపు నిండా పాలిచ్చింది. ఈ దృశ్యం అక్కడ గేమ్ చూడ్డానికి వచ్చిన నింగ్లున్ హంఘల్ అనే మహిళను ఆకర్షించింది. వెంటేనే ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో మిజోరం క్రీడా మంత్రి రాబర్ట్ రొమానియాను కూడా ఆకట్టుకుంది. దీంతో ఆ చిత్రాన్ని ఆయన మిజోరం స్టేట్ గేమ్స్ 2019కు మస్కట్‌గా ఉపయోగిస్తామని అంటున్నారు. అలాగే, బిడ్డపై ప్రేమను కురిపించే ఆ మాతృమూర్తిని రూ.10 వేలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించాలనుకుంటున్నట్లు తెలియజేశారు. ఓ పక్క క్రీడా స్ఫూర్తి.. మరోపక్క అమ్మ ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఆమెకు నెటిజన్స్ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read MoreRead Less
Next Story