ఆ ఊతపదంతో పాపులారిటీని సంపాదించిన గొల్లపూడి

ఆ ఊతపదంతో పాపులారిటీని సంపాదించిన గొల్లపూడి

gollapudi-maruthi-rao-dialo

రచయిత మారుతీరావు నటుడుగా తెరంగేట్రం చేసిన విధమే కాస్త ప్రత్యేకం. కోడి రామకృష్ణ దర్శకుడుగా అరంగేట్రం చేయడానికి ముందుగా అనుకున్న కథ తరంగిణి. అయితే చిత్ర కథానాయకుడు చిరంజీవి అని నిర్మాత కన్ఫర్మ్ చేయడంతో కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యింది. అందులో ఓ పాలిష్డ్ విలన్ రోల్ ఉంటుంది. దాన్ని ఎవరితో చేయించినా పండదనిపించింది కోడి రామకృష్ణకు. ఫైనల్ గా మీరే చేసేయండని గొల్లపూడిని బలవంతం పెట్టేశారు. ఆయనా సరే అనేశారు.

నటుడుగా రంగస్థలం మీద అనుభవం ఉన్న మారుతీరావు ఎందుచేతనో సినిమాల్లో అంత త్వరగా తెర మీదకు రాలేదు. వచ్చిన తర్వాత ఆగలేదు. గొల్లపూడి మాత్రమే చేయగల పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నటుడుగా ప్రయాణం ప్రారంభించాక రచయితగా గొల్లపూడిని పిలవడం తగ్గిందని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకున్నారు. కమల్ హసన్ డైరక్ట్ చేసిన హేరామ్ లో కమల్ కోరి మరీ ఓ పాత్ర గొల్లపూడితో చేయించడం విశేషం.

ఇక అనేక పాత్రలు గొల్లపూడిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అద్భుతంగా పేలినవి అనేకం ఉన్నాయి. అభిలాషలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఓ శాడిస్ట్ విలన్ రోల్ చేశారు గొల్లపూడి. బామ్మర్ది అనే ఊతపదంతో ప్రవేశించే ఆ పాత్ర అభిలాష సెకండాఫ్ ను నిలబెట్టింది. అలా సినిమా సక్సస్ కు ఊతంగా నిల్చిన అనేక పాత్రలకు గొల్లపూడి ప్రాణం పోశారు. సుమారు 87 చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన గొల్లపూడి నటుడుగా 230 చిత్రాలు చేశారు. అందులో అన్ని రకాల పాత్రలూ ఉన్నాయి. క్యారెక్టర్ రోల్స్ తో పాటు కమేడియన్ గానూ మెప్పించారు గొల్లపూడి. విలన్ రోల్స్ లోనూ అదరగొట్టారు. ముఖ్యంగా గుంటనక్క తరహా విలనిజం చేయాలంటే.. గొల్లపూడిదే అగ్రతాంబూలం. బలరామకృష్ణులు లో సూదిలో దారం అనే ఊతపదంతో తను చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు.

Tags

Read MoreRead Less
Next Story