తాజా వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ విషయంలో హైక‌మాండ్ అల‌ర్ట్

తెలంగాణ కాంగ్రెస్ విషయంలో హైక‌మాండ్ అల‌ర్ట్
X

tcongress

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట‌మితో డీలా ప‌డ్డ కాంగ్రెస్‌ను .. మ‌ళ్ళీ యాక్టివ్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నించింది. నైరాశ్యంలో కూరుకు పోయిన రాష్ట్ర నేత‌ల్లో చ‌ల‌నం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న ప‌రిస్థితులు కాస్త .. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ గా మ‌రిన నేప‌థ్యంలో కాంగ్రెస్ హైక‌మాండ్ అల‌ర్ట్ అయ్యి ఈ చర్యలకు ఉపక్రమించింది. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌లు .. కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన‌ప్పుడు వ‌చ్చిన ఆరోప‌ణ‌లే ఆయుధాలుగా పార్టీని యాక్టివ్ చేయాల‌ని ఢిల్లీ పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీని కోసం శాఖ‌ల వారిగా పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు ఏఐసీసీ పెద్ద‌లు. ఉత్త‌మ్ నేతృత్వంలో సాగునీటి అంశాల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ .. రేవంత్ నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్ళు.. భూకేటాయింపుల అంశాల‌పై క‌మిటీ .. మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి నేతృత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఎదుర్కొన్న ఆరోప‌ణ‌ల అంశాల‌పై ఓ క‌మిటీని నియ‌మించారు ఢిల్లీ పెద్ద‌లు.

అధిష్టానం ఆదేశాల‌తో రంగంలోకి దిగిన క‌మిటీల ముఖ్య‌నేత‌లు త‌మ ప‌నిలో ఆర్భాటం కనబరిచారు. రాష్ట్రంలో రీడిజైన్ లో భాగంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన సాగునీటి ప్రాజెక్ట్ లపై ఉత్త‌మ్ నేతృత్వంలో ఏర్పాటైన క‌మిటీ .. పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో క‌లిసి తుమ్మిహెట్టి విజిట్ చేసింది. ఆ తరువాత కమిటీ పనితీరు అటకెక్కింది. తిమ్మిడిహెట్టి విజిట్ తో సరిపెట్టిన కమిటీ ముఖ్యనేతలు .. ఇక మిగతా ప్రాజెక్ట్స్ విజిట్ ను పట్టించుకోలేదు. ప్రాకేక్ట్స్ నిర్మాణంలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు .. అసలు ఆ అవినీతి ఎంతో ఎక్కడ జరిగిందో .. రీడిజైన్ వల్ల జరిగిన నష్టమేంటో .. ప్రజలకు వివరించడం పంకన పెడితే .. అధిష్టానం వేసిన కమిటీ ద్వారానైనా ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ ఇవ్వలేక పోయారు.

ఇక విద్యుత్ కొనుగోళ్ళ అంశాల‌పై నియామ‌క‌మైన ఎంపీ రేవంత్ రెడ్డి క‌మిటీ సైతం త‌మ ప‌నిలో ముందు దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రంలో 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా ముసుగులో దోపిడి జ‌రుగుతోంద‌ని రేవంత్ మీడియా ముందుకు వ‌చ్చి ఆరోపణలు చేశారు. ఈ కొనుగోళ్ళ‌లో ఎక్క‌డెక్క‌డ ఏం జ‌రిగింద‌నే అంశాల‌ను వివ‌రిస్తూ .. ఈ ఆదారాల‌తో కేంద్ర విచార‌ణ సంస్థ‌ల ముందుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు చిత్త‌శుద్ది ఉంటే .. త‌మ పిర్యాదుతో .. తామిచ్చే ఆదారాల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు కేంద్రానికి పిర్యాదు చేసిన దాఖలాలు లేవు. కేంద్ర సర్కారుకు పిర్యాదు అటుంచితే .. పార్టీ తరుపున బాధ్యతలు ఇచ్చారు కాబట్టి కనీసం హైకమాండ్ కన్నా .. దీనిపై నివేదిక ఇచ్చిన దాఖలాలు లేవు.

ఇక ఉత్త‌మ్ .. రేవంత్ క‌మిటీల‌తో పాటు .. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన స‌మ‌యంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు సేకరించి కేంద్ర విచారణ సంస్థలకు ఇచ్చే బాధ్యతను మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన క‌మిటీకి అప్పగించింది అధిష్టానం. ఉత్తమ్ ,రేవంత్ కనీసం తమకు అప్పగించిన కమిటీ బాధ్యతలను ప్రారంభంలోనైనా దూకుడు కనబరిచారు.మర్రి శశిధర్ రెడ్డి కమిటీ మాత్రం అసలు పని ప్రారంభించినట్లు ఎక్కడా కనబడలేదు. కేంద్రమంత్రిగా ఆనాడు కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి ఆధారాలు సేక‌రించి .. కేంద్ర హోమ్ మంత్రిత్వ‌శాఖ ముందుకు వెళ్ళాల‌ని క‌మిటీకి టాస్క్ ఉన్నప్పటికీ .. ఇదిగో ఇవి ఆధారాలు అని కనీసం మీడియా ముందుకైనా వచ్చే ప్రయత్నం చేయలేదు మర్రి కమిటీ.

అయితే .. ఢిల్లీ నుంచి వెళ్లిన ఆదేశాలను రాష్ట్ర నేతలు ఈమేరకు అమలు చేస్తున్నారు .. రాష్ట్రంలో ఏం జరుగుతోంది .. అని అధిష్టానం నుంచి పర్యవేక్షణ కూడా కరువైయ్యిందనే చెప్పాలి. ఏఐసిసి నుంచి వెళ్లిన టాస్క్ అమలుకు కనీసం టైమ్ బాండ్ కూడా లేకపోవడం కొసమెరుపు. ఇక ఏఐసిసి నుంచి రాష్ట్ర ఇంచార్జీ గా ఉన్న కుంతియా సైతం ఈ అంశాలపై పెద్దగా సీరియస్ గా లేకపోవడం ఆసక్తికరం. కుంతియా రాష్ట్ర పర్యటనలు కేవలం విహారయాత్ర లాగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. కుంతియా తన స్వంత రాష్ట్రంకు వెళ్లెప్పుడు ఢిల్లీ నుంచి వయా హైదరాబాద్ అంటూ .. కొందరు పార్టీ నేతలు జోక్స్ వేసుకుంటుండటం ఆయన పనితీరుకు అద్దం పడుతుంది.

ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు .. ఇటు టీఆర్ఎస్ .. అటు బీజేపీల‌ను కార్న‌ర్ చేసేందుకు ప‌క్కా ప్లాన్ తో హైకమాండ్ రాష్ట్ర నేతలకు ప్రత్యేక టాస్క్ ఇచ్చినా .. రాష్ట్ర హస్తం నేతలు మాత్రం తూతూ మంత్రంగా ముగించారు.

Next Story

RELATED STORIES