తాజా వార్తలు

దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం..

దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం..
X

disha-accused

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని.. వాటిని ఏం చేయాలో చెప్పాలని కోరుతూ ప్రభుత్వ ప్లీడర్‌కి లేఖ రాసేందుకు గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహ్మద్‌ అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు అదే రోజు ఫోరెన్సిక్‌ వైద్యుల బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. ఆ తర్వాత మృతదేహాలను మెడికల్‌ కాలేజీ లో భద్రపరిచారు. ఐతే.. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈనెల 13 వరకు గాంధీ మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు సూచించింది. దీంతో నలుగురి మృతదేహాలను 9న గాంధీ మార్చురీకి తీసుకొచ్చి ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరిచారు.

ఫ్రీజర్‌ బాక్సుల్లో పెట్టిన మృతదేహాలు వారం రోజుల తర్వాత క్రమంగా కుళ్లిపోయే అవకాశం ఉంది. ఐతే.. ఎంబామింగ్‌ చేసి.. ఫార్మల్‌ డీహైడ్‌ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే పాడవకుండా ఉంటాయి. దీంతో మృతదేహాలకు ఎంబామింగ్‌ చేయాలని ఫోరెన్సిక్‌ వైద్యులు నిర్ణయించారు. అయితే ఎంబామింగ్‌ చేస్తే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేందుకు అవకాశం ఉండకపోవడం, మరోపక్క మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభమయ్యే దశకు చేరుకోవడంతో ఫోరెన్సిక్‌ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు.

ఇలాంటి కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాలకు ఎంబామింగ్‌ చేయాలనే నిబంధన ఉందని సంబంధిత వైద్యులు చెబుతున్నారు. ఇదే అంశంపై సోమవారం చర్చించిన గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం, ఫోరెన్సిక్‌ వైద్య బృందం.. మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని కోరుతూ జీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచాలన్న కోర్టు ఆదేశాల గడువు కూడా పూర్తయ్యింది. దీంతో మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని జీపీకి లేఖ రాయనున్నారు.

Next Story

RELATED STORIES