తాజా వార్తలు

మార్కెట్లో నాణ్యత లేని మందులు.. ప్రమాదంలో రోగుల ప్రాణాలు!

మార్కెట్లో నాణ్యత లేని మందులు.. ప్రమాదంలో రోగుల ప్రాణాలు!
X

medicine

జ‌బ్బు చేసిన‌ప్పుడు మ‌నం వాడే మందులు నాణ్య‌మైన‌వేనా అంటే కాదనే స‌మాధాన‌ం వినిపిస్తోంది. మార్కెట్ లో దొరికే ట్యాబ్‌లెట్లు, క్యాప్సిల్స్‌, సిర‌ప్స్‌ మొదలుకొని ఇంజ‌క్ష‌న్ల వ‌ర‌కు నకిలివిగా తేలుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల నుంచి కలెక్ట్‌‌ చేస్తున్న శాంపిళ్లలో 3 నుంచి 4శాతం మందులు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నాయి. దీంతో ఇవి రోగుల ప్రాణాలను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 26వేలకు పైగా మెడికల్‌ షాపులు ఉన్నాయి. వివిధ బ్యాచ్‌ల వారీగా వాటికి నెలకు కొన్ని వందల రకాల మందులు వస్తుంటాయి. ఐతే వీటిని పర్యవేక్షించే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 మందే ఉన్నారు. ఈ మెడికల్‌ షాపుల నుంచి నెలకు సగటున 200 నుండి 220 శాంపిల్స్‌ తీసి పరీక్షిస్తే.. అందులో కొన్ని నాణ్యత లేనివిగా తేలుతున్నాయి. సగటున ఒకటిన్నర నుంచి రెండు శాతం మందులు నాణ్యతా పరీక్షల్లో విఫలమవుతున్నాయి. వాటిలో ఉండాల్సిన స్థాయిలో మందు ఉండట్లేదు! అయినా, ఎటువంటి చర్యలూ లేవు! అవే మందులు కొనసాగుతున్నాయి.

కొన్ని ర‌కాల మందు బిల్ల‌లు 100 ఎంజీ ఉండాల్సిన చోట, 70 ఎంజీ ఉంటే దాన్ని ఎన్‌‌ఎస్‌‌క్యూగా పేర్కొంటారు. ఉండాల్సిన స్థాయిలో మందు లేకపోతే, రోగం తగ్గించడంలోనూ ఆ మెడిసిన్ ఫెయిల్ అవుతుంది. డిస్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే కడుపులోకి వెళ్లిన తర్వాత ట్యాబ్లెట్ నుంచి మందు సకాలంలో రిలీజ్ అవుతుందా? లేదా? అని తెలుసుకునేందుకు చేసే టెస్ట్‌‌. సకాలంలో ట్యాబ్లెట్ స్ల్పిట్ అవకపోతే, అది వేసుకున్నా వృథానే అవుతుంది. ఈ నాసిరకం మందులతో ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. ఇక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు సేకరించిన నమూనాలు విఫలమైతే వాటిని అమ్ముతున్న దుకాణం నుంచి తయారీదారు వరకూ అందరికీ నోటీసులు ఇవ్వాలి. మార్కెట్‌లో ఉన్న ఆ బ్యాచ్‌ మందు మొత్తాన్ని వెనక్కి తెప్పించి, నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ ఒక్క అధికారి చేయ‌డం లేదు. వెర‌సీ నాసిరకం మందుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది.

ఇక‌ రాష్ట్రంలో 589 డ్రగ్‌ తయారీ కంపెనీలు, 186 బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లదే. రాష్ట్రంలో కేవలం 61 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉండడంతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. మెడికల్‌ షాపులు, తయారీ యూనిట్లు, బ్లడ్‌ బ్యాంకులను తనిఖీ చేయడం, శాంపిళ్లను సేకరించడం, అవి నాసిరకమని తేలితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం సకాలంలో జరగడం లేదు. దీంతో యథేచ్చగా నాసిరకం మందులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తక్కువ సంఖ్యలో శాంపిళ్లను పరీక్షిస్తేనే ఏకంగా రెండు శాతం వరకూ పనికి రానివని తేలుతున్నాయని, శాంపిళ్ల సంఖ్య పెంచితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Next Story

RELATED STORIES