సమత అత్యాచారం, హత్య కేసు విచారణ బుధవారానికి వాయిదా

సమత అత్యాచారం, హత్య కేసు విచారణ బుధవారానికి వాయిదా

SAMATA

సమత అత్యాచారం, హత్య కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. నిందితుల తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిని నియమించారు. సీనియర్ అడ్వకేట్ రహీంను వీరి తరపున వాదించేందుకు కోర్టు ఎంపిక చేసింది. సోమవారం నుంచి సమత కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ ప్రారంభమైంది. ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా, మరో ఇద్దరు నిందితులు షేక్‌ శాబొద్దీన్‌, షేక్‌ ముఖ్‌దూమ్‌ను వరుసగా రెండోరోజు కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

ఈ కేసులో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణలో భాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉంది. అత్యాచారం, హత్యకు గురైనది దళిత మహిళ కావడంతో మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్‌లో ‘సమత’ అనే మహిళ అత్యాచారం, హత్యకు గురైంది. నిందితులను మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు. బాధితురాలిపై గ్యాంగ్‌రేప్ చేసిన తర్వాత, గొంతుకోసి చంపినట్లు పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లోనూ ఈ విషయం ధ్రువీకరణ అయినట్లు తేలింది. సమత కేసులో నిందితులు ఏ-1గా షేక్‌బాబా, ఏ-2 షేక్‌ షాబొద్దీన్‌, ఏ-3 షేక్‌ ముఖ్‌దూమ్‌లకు ఉరి శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story