మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

liquor-shop

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అన్ని రకాల మద్యం ధరలను 20 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. మందు బాబుల జేబులకు భారీ చిల్లు పడనుంది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. సాధారణ మద్యంపై క్వార్టర్‌కు 20 రూపాయలు, హాఫ్‌ బాటిల్‌పై 40, ఫుల్‌బాటిల్‌ పై 80, లీటర్‌ బాటిల్‌పై 110 వరకు పెంచారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ఫుల్‌ బాటిల్‌ ధర 150 వరకు పెరిగాయి. ఇక బీర్లపై 20 నుంచి 40 రూపాయల వరకు ధరలు పెరగనున్నాయి. గతంలో లైట్‌ బీర్‌ 100 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దాన్ని120కి పెంచారు. స్ట్రాంగ్‌ బీర్‌ను 120 రూపాయల నుంచి 130కి పెంచగా, కొన్ని బ్రాండ్లు 180 వరకు పెరిగాయి.

పెంచిన మద్యం ధరలతో ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.350 కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే, భారీగా అమ్ముడుపోయే బ్రాండ్ల ధరలనే అధికంగా పెంచారు. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం పడనుంది. విదేశీ మద్యం ధరల పెంపు మాత్రం సాధారణంగా ఉంది. న్యూఇయర్, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం మద్యం ధరలను పెంచినట్లు తెలుస్తోంది. అయితే మద్యం వ్యాపారులు ఇప్పటికే తీసుకున్న స్టాక్‌ను పాత ధరలకే అమ్మాల్సి ఉంటుందని, కొత్తగా బుధవారం నుంచి తీసుకునే స్టాక్‌కే కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్‌ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి మద్యం ధరలను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దీనికోసం మంత్రివర్గ ఉప సంఘం వేయాలని భావించింది. కానీ, ఉప సంఘం నియమించకుండానే, ఆ కమిటీ సిఫారసు లేకుండానే ఎక్సైజ్‌ అధికారులు గప్‌చుప్‌గా మద్యం ధరలను సవరించేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే మందుబాబులు ఉలిక్కిపడగా.. మద్యం షాపు నిర్వహకులు

వారి జేబులకు మరింత చిల్లు పెట్టే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రాత్రి 9గంటలకే మద్యం షాపులు మూసేశారు. మంగళవారం నుంచి పెంచిన ధరలు అందుబాటులోకి వస్తుండడంతో.. మంగళవారం నుంచి ఎక్కువ ధరలకు మద్యం అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో అలా చేశారు. అందుకే సమయం కాక ముందుకే మద్యం షాపులను క్లోజ్‌ చేశారు. దీంతో మద్యం షాపుల నిర్వహకులపై మందుబాబులు ఫైర్‌ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ గ్రామంలోనూ వైన్‌షాప్‌ నిర్వహకుడు ఇలానే చేశాడు. ఐతే ప్రభుత్వం మాత్రం పాత స్టాక్‌కు..పెంచిన ధరలు అమలు చేయ్యొద్దని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story