అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌

donald-trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ తగిలింది. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 197 మంది ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు బుధవారం ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.

ట్రంప్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్లు సైతం ఓటు వేయడం విశేషం. అభిశంశస తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇక సెనేట్‌లోనూ విచారణ ఎదుర్కొనున్నారు. అక్కడ కూడా తీర్మానం ఆమోదం పొందితే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో ట్రంప్‌ అభిశంసనకు గురయ్యే అవకాశాలు దాదాపు లేవు. వచ్చే నెలలో ఆయన ఎగువ సభ అయిన సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు. 2020లో జరిగే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న జో బిడెన్‌కు, ఆయన కుమారుడికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై విచారణ జరపాలంటూ కొన్నాళ్ల క్రితం ఉక్రెయిన్‌ అద్యక్షుడిని ట్రంప్ కోరడం చర్చనీయాంశమైంది. ఇది అధికార దుర్వినియోగమేనంటూ ఆయనపై అభిశంసన పెట్టారు.

మరోవైపు.... తనపై ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్‌కు 6 పేజీల ఘాటు లేఖ రాశారు ట్రంప్‌. తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రతినిధుల సభలో డెమోక్రట్లు రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి నేరాలకూ పాల్పడలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని.. ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్దం ప్రకటిస్తున్నారన్నారు. అభిశంసన చర్యతో ముందుకు వెళితే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లేనని..... రానున్న ఎన్నికల్లో డెమోక్రాట్లకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story