తాజా వార్తలు

మారనున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగుల డ్రెస్‌కోడ్‌

మారనున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగుల డ్రెస్‌కోడ్‌
X

tsrtc

సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించిన పలు వరాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాత్రి 8 గంటలలోపే మహిళా ఉద్యోగుల విధులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టారు. అటు.. ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగుల డ్రెస్‌కోడ్‌ మారనున్నది. ఖాకీ డ్రెస్‌ స్థానంలో.. మరో రంగు డ్రెస్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో.. ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అన్ని డిపోల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న యాజమాన్యం.. చెర్రీ రంగు డ్రెస్‌ను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ దుస్తులను ఎంపిక చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మహిళా ఉద్యోగులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ఒక్కో ఉద్యోగికి రెండు డ్రెస్‌ల చొప్పున.. మొత్తం 9 వేల వరకు డ్రెస్‌లు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఏక మొత్తంలో ఆర్డర్‌ ఇస్తే.. కొలతల సమస్య తలెత్తవచ్చని.. క్లాత్‌ ఇచ్చి కుట్టించుకునే వెసులుబాటు ఇస్తే సౌకర్యంగా ఉంటుందని కొందరు అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు అందరు కండక్టర్లకు ఖాకీ డ్రెస్సులను యాజమాన్యం ఇవ్వడం లేదు. కేవలం ఆర్డినరీ బస్సుల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది మాత్రమే ఖాకీ దుస్తులు ధరిస్తున్నారు. అయితే మిగిలిన వారికి ఉన్నట్లే మెట్రో బ్లూ కలర్ దుస్తులు ఇస్తే ఇబ్బంది ఉండదని కొంతమంది కండక్టర్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఒకట్రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అటు.. రేమండ్స్ బ్రాండ్ దుస్తులను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. ఐతే.. ఆఫ్రాన్ మాత్రమే ఇవ్వాలా? చీరలు కూడా ఇవ్వాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళా ఉద్యోగుల మాదిరిగానే.. డ్రైవర్లకూ డ్రెస్‌ రంగు మార్చాలని అన్ని డిపోల నుంచి ఒత్తిడి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తే త్వరలోనే పురుష డ్రైవర్లు, కండక్టర్లకు డ్రెస్ కోడ్ మారే అవకాశం ఉంది.

రెండు రోజుల్లో చైల్డ్‌ కేర్‌ లీవ్‌ ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు బస్‌పాస్‌ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో నిర్ణయాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డిపోలవారీగా మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు, డ్రెస్‌ ఛేంజ్‌ గదులను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. కాలం చెల్లిన బస్సులను టాయిలెట్లుగా మార్చి వినియోగించుకునే ఆలోచన చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పిస్తోంది ఆ సంస్థ యాజమాన్యం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story

RELATED STORIES