దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై వాడివేడి వాదనలు

దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై వాడివేడి వాదనలు
X

disha

దిశ హత్యాచార నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించి వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించే వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేసిన తర్వాతే బంధువులకు అప్పగించాలనుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. శనివారం ఉదయం10.30 గంటల్లోపు అభిప్రాయం తెలపాలని ఆదేశించింది.

మరోవైపు మృతదేహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. శనివారం జరిగే విచారణకు సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. రాష్ట్ర న్యాయ, పోలీసు వ్యవస్థల తీరును ప్రపంచమంతా చూస్తోందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతి చెందగా.. అప్పటి నుంచి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.

Next Story

RELATED STORIES