పిలవని పెళ్లికి వెళ్లారు.. పెళ్లి కొడుకుని చంపేసారు..

పెళ్లంటేనే హడావిడి.. బంధువులు, బాజాలు, భజంత్రీలు.. పిలిచిన వాళ్లందరూ వచ్చారో లేదో అని కించిత్ అని పించినా.. కొత్త వాళ్లను చూస్తే వీళ్లనెప్పుడూ చూసినట్లు లేదే అని అనిపిస్తుంది. పిలవని పేరంటానికి వెళ్లడానికి మనకి కూడా సిగ్గుగానే ఉంటుంది. అమెరికాలో మాత్రం పిలవకపోయినా వెళ్లి మరీ అవమానం జరిగిందని ఏకంగా పెళ్లి కొడుకునే చంపేశారు ఆ దుర్మార్గులు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంఘటన వధువు కుటుంబంలో విషాదాన్ని నింపింది.
పెళ్లికొడుకు జాయ్ మెల్గాజ్ పెళ్లితంతు ముగిసిన తరువాత రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి క్యాస్టానెదా రమిరెజ్, అతని సోదరుడు జోస్యూ క్యాస్టానెదా రమిరెజ్‌లు వెళ్లారు. జాయ్ కుటుంబసభ్యులు వారిని గుర్తించి.. వీళ్లు చూడబోతే రౌడీల్లాఉన్నారని భావించి బయటకు పంపించారు. అన్నదమ్ములిద్దరూ అవమానంగా భావించారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బ్యాట్‌లు తీసుకుని వచ్చి గొడవకు సిద్దమయ్యారు. పెళ్లి కొడుకు జాయ్ మెల్గాజ్ వారితో గొడవకు దిగాడు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుటుంబీకులను తీవ్రంగా కొట్టారు. జాయ్‌కు బ్యాట్ బలంగా తగలడంతో అక్కడికక్కడే స‌్పృహ తప్పి పడిపోయాడు. క్షణాల్లో ప్రాణాలకోల్పోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com