ముమ్మాటికి తెలంగాణ లౌకిక రాష్ట్రమే: కేసీఆర్

తెలంగాణ వందకు వంద శాతం లౌకిక రాష్ట్రమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇస్లామిక్ దేశాల్లో ఒకటి, రెండు పండుగలు మాత్రమే ఉంటాయని.. భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను కేసీఆర్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తాగునీరు, విద్యుత్ సమస్యలేని రాష్ట్రంగా తెలంగాణను తయారుచేశామని వివరించారు సీఎం కేసీఆర్. 20-25 ఏళ్లలో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా 70 నుంచి 80 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు.
అంతకుముందు.. ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటిని కేసీఆర్ సన్మానించారు. చాగంటి కోటేశ్వరరావు గొప్ప ప్రవచనకర్త.. ఆయన మానవ జాతికి దొరికిన మణిపూస అని కేసీఆర్ అన్నారు. చాగంటిని సన్మానిస్తే.. మనకు మనం సన్మానించుకున్నట్లన్న కేసీఆర్.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com