వెన్ను నొప్పి అని ఎక్స్ రే తీస్తే.. శరీరంలో బులెట్లు.. అసలేం జరిగింది?

వెన్ను నొప్పితో బాధపడుతున్న యువతికి వైద్యచికిత్స చేయడంతో... ఆమె శరీరంలో బుల్లెట్లు బయటపడిన ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. ఆస్మాబేగం తీవ్ర వెన్నునొప్పితో రెండు నెలలక్రితం నిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఎక్స్ రే తీసి బాడీలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి చికిత్స చేసి వాటిని తొలగించారు. అయితే ఆ బుల్లెట్లు ఎలా శరీరంలోకి దిగాయో చెప్పకపోవడంతో వైద్యులు పంజగుట్ట పోలీసులకు సమాచారం అందిచారు. వైద్యుల సమాచారం మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే యువతి శరీరంనుంచి బయటపడిన బుల్లెట్ భారత్ లో తయారైన తుపాకిదా..లేక విదేశాలకు చెందినవా .. అనేది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న. అది లైసెన్స్ గన్ కు చెందిన బుల్లెట్లేనా అనేది నిపుణుల నివేదిక అందిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలమన్నారు. యువతి కుటుంబ నేపధ్యంపై కూడా విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
18 ఏళ్ల ఆస్మాబేగం పాతబస్తీలోని జహనుమ ప్రాంతంలో నివసిస్తోంది. 7వ తరగతి వరకు చదువుకున్న ఈ యువతి ప్రస్తుతం టైలరింగ్ పనిచేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా వెన్నునొప్పిరావడంతో స్థానికంగా ఉన్న వైద్యుడి వద్ద చికిత్సతీసుకుంది. మళ్లీ నొప్పిరావడంతో నిమ్స్ కు వచ్చి వైద్యం చేయించుకుంది. దీంతో ఈ విషయం కాస్తా బయటపడింది. యువతి బంధువులు మాత్రం వైద్యుల తప్పిదమే తప్ప తమకేమి తెలియదని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com