తెలంగాణ‌లో క్షేత్ర‌స్థాయిలో బలోపేతమయ్యేందుకు సిద్ధమైన బీజేపీ

తెలంగాణ‌లో క్షేత్ర‌స్థాయిలో బలోపేతమయ్యేందుకు సిద్ధమైన బీజేపీ

telangana-bjp

తెలంగాణ‌లో తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ.. క్షేత్ర‌స్థాయిలో బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది.. ఈ బాధ్య‌త‌ను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భుజానికెత్తుకుంది. ఇందులో భాగంగా మూడ్రోజులు రాష్ట్ర స్థాయి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ కార్యక్రమానికి సంఘ్ ప‌రివార్ నుండి 8వేల మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌రవుతున్నారు. సంఘ్ క్షేత్రాలైన బీజేపీ , వీహెచ్‌పీ, ఏబీవీపీ, బజ‌రంగ్‌ద‌ళ్ లాంటి సంస్థ‌ల నుండి జిల్లా అధ్య‌క్షుడు ఆ పై స్థాయి నేత‌లు పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్య‌క్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుల వ‌రకు హాజ‌రు కానున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గవ‌త్ హాజ‌ర‌ు కానుండ‌టంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు క్షేత్ర‌స్థాయిలో బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన అంశాల‌పై దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది...

మూడు రోజుల ఆర్ఎస్ఎస్ శిక్ష‌ణా శిబిరంలో సంఘ్ ప‌రివార్ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 క్ల‌స్ట‌ర్స్ ను గుర్తించిన ఆర్ఎస్ఎస్ 2024 అన్ని ప్రాంతాల్లో శాఖ‌ల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. గ‌త ఏడాది కాలంగా సంస్థ‌కు అనుకూల వాతావ‌ర‌ణం దృష్ట్యా ఇప్ప‌టికే వెయ్యి క్ల‌స్ట‌ర్స్ లో శాఖ‌ల‌ను ఏర్పాటు చేసింది. మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసుకోవాల‌ని నిర్ణ‌యించారు సంఘ్ పెద్ద‌లు. అర్భ‌న్ ప్రాంతాల్లోని 800 క్ల‌స్టర్స్ లో సేవా కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విసృతం చేయాలని భావిస్తున్నారు. మూడు రోజుల శిక్ష‌ణా త‌ర‌గ‌తుల్లో సంఘ్ ప‌రివార్ స‌భ్యుల‌కు గ్రామీణ వికాసం, గో ర‌క్ష‌ణ‌, కుటుంబ విలువ‌లు, హిందు ధ‌ర్మ ప్ర‌చారం, సామాజిక సామ‌ర‌స్య‌త , ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అంశాల పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. సంఘ్ ఈ అంశాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ళ‌డం ద్వారా బీజేపీని బలోపేతం చేయనుంది..

శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో భాగంగా మొద‌టి రోజు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్య‌క్ర‌మాలు, శాఖ‌ల ప‌నితీరుపై ఏర్పాటుచేసిన ఫోటో గ్యాల‌రీని ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం ఆర్ఎస్ఎస్ సాంప్ర‌దాయ కార్య‌క్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ నేత‌లు, అనుబంద సంస్థ‌ల నేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించనున్నారు. మ‌రుస‌టి రోజు ప్ర‌ధాన ఘట్టమైన ప‌ద సంచ‌ల్ కార్యక్ర‌మం నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 25 వేల‌ మంది సంఘ్ కార్య‌క‌ర్త‌లు హాజ‌రు కానున్నారు. మూడు రూట్ ల‌లో రూట్ మార్చ్ చేసి ఎల్బీ న‌గ‌ర్ చౌర‌స్తా కు చేరుకొని .. అక్క‌డ నుండి ప్రద‌ర్శ‌న రూపంలో స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంకు చేరుకోనున్నంది . మూడ‌వ రోజు అంత‌ర్గ‌త కార్య‌క్ర‌మాలకు ప‌రిమితం కానుంది.

మోహ‌న్ భగ‌వ‌త్ హ‌జ‌రు కానున్న ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీకి ఎలాంటి సూచ‌న‌లు , స‌ల‌హాలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ముగిసిన త‌రువాత బీజేపీ అడుగులు ఎలాఉంటాయ‌న్న దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story