తెలంగాణలో మొదలైన ఎన్నికల సందడి..

తెలంగాణలో  మొదలైన ఎన్నికల సందడి..

ts

తెలంగాణ మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ప్రక్రియను మొదలు పెట్టింది. వార్డుల విభజన, ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నద్దతకు వివరాలు సేకరించింది. ఇక వార్డుల రిజర్వేషన్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపట్టనున్నారు. మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో చేపడతారు. మున్సిపాల్టీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితా అభ్యంతరాలపై విచారణ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

రాష్ట్రంలోని 120మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు, 2727 వార్డులు, 385 డివిజన్లలో 79 లక్షలా 92 వేలా 434 మంది ఓటర్లకుపైగా ఉండగా 8,056 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో లక్ష రూపాయలు, లక్షా 50 వేలు కార్పొరేషన్లలో అభ్యర్థి ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని జహీరాబాద్, మణుగూరు, పాల్వంచ, మందమర్రి, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, బాదేపల్లి మున్సిపాలిటీలకు అనివార్య కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఖమ్మం, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ల పదవీకాలం ముగియక పోవడంతో ఆ మూడు కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థి సంతానం అంశాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు.

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, ప్రభుత్వం తరపున ఎలాంటి బ్యానర్లు పెట్టకూడదని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 27 కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్, 28న పొలిటికల్ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్ లు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే ఎన్నికల అధికారులకు దఫాలుగా ట్రైనింగ్ కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. జనవరి 1, 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, ఒక పోలింగ్ స్టేషన్ లో 800 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story