అమరావతిలో అర్ధరాత్రి హైటెన్షన్.. అడుగడుగునా పోలీసులే

అమరావతిలో అర్ధరాత్రి హైటెన్షన్.. అడుగడుగునా పోలీసులే

police

నవ్యాంధ్ర రాజధాని అమరావతి గ్రామాలు పోలీసు బలగాలతో నిండిపోయాయి. తాడేపల్లి నుంచి సెక్రటేరియట్‌ వరకు దారి పొడవునా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం కేబినెట్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామస్తుల నుంచి నిరసనలు ఎదురవుతాయనే ఉద్దేశంతో భారీగా బలగాలు మోహరించాయి. ఇప్పటికే సచివాలయానికి వెళ్లే రోడ్డు వెంట ఉన్న నివాసాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, రైతులు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేయడంతో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కొందరు రైతులపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళనలు చేయకుండా ఉండేలా సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు గ్రామాల్లోకి రావడంతో రైతులు, మహిళలు, ఆందోళనకు గురయ్యారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, మందడం, మల్కాపురం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

మరోవైపు రాజధాని ప్రాంత రైతుల నిరసనలు రాత్రంతా కొనసాగాయి. మందడంలో రైతుల ధర్నా ఉధృతంగా సాగుతోంది. రాజధాని తరలింపు ఆలోచనను వెనక్కు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు కుల, మతాలకు అతీతంగా అంతా మద్దతు తెలిపారు. ముస్లింలు ప్రార్థనలతో, క్రిస్టియన్లు కీర్తనలతో, హిందువులు హరేరామ అంటూ భజనలు చేసి తమ నిరసనలు తెలిపారు. రోడ్లపైనే భోజనాలు చేశారు. దిండ్లు, దుప్పట్లు తెచ్చుకుని రోడ్లపైనే నిద్రించారు.

అటు మందడంలో అర్థరాత్రి హైటెన్షన్‌ వాతావరణం కనిపించింది. పెద్ద సంఖ్యలో పోలీసులు రైతుల దీక్షా శిబిరం దగ్గరకు వచ్చారు. టెంట్లు తీసేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను పోలీసులకు రైతులు గుర్తు చేశారు. డీజీపీ వ్యాఖ్యలకు పోలీసులే విలువ ఇవ్వరా అంటూ నిలదీశారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయిన పోలీసులు.. కాసేపటికి మళ్లీ వచ్చారు. గ్రామస్తులు కూర్చొని ఉండగానే టెంట్లు తొలగించే ప్రయత్నాలు చేశారు. తాళ్లు కట్‌ చేయడంతో గ్రామస్తులు, మహిళలపై టెంట్‌ పడింది. దీంతో వారు పక్కకు తప్పుకున్నారు. గ్రామస్తులను బలవంతంగా అక్కడ్నుంచి పంపించేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నించారు. అయితే, ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆందోళనలు మాత్రం కొనసాగుతాయని రైతులు, మందడం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆందోళన కొనసాగించారు.

Tags

Read MoreRead Less
Next Story