సినిమా ప్రమోషన్స్ కు ‘‘చంద్ర’’గ్రహణం

సినిమా ప్రమోషన్స్ కు ‘‘చంద్ర’’గ్రహణం
X

chandragrahanam

ఒక వ్యాపారి తను తయారు చేసిన ప్రొడక్ట్ ను అమ్మాలంటే దాని గురించి వీలైనంత ఎక్కువ జనానికి తెలిసేలా చూస్తాడు. ఎందుకంటే తన ప్రోడక్ట్ ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అతనికి అంత ఎక్కువ ఉపయోగం. ఆ ఉత్పత్తి ఎలా ఉంది అనేది తర్వాతి మేటర్.. ముందు అది జనానికి చేరాలి. అందుకోసం తనకు వీలున్న అన్ని మార్గాలను ఎంచుకుంటాడు. ఇది వ్యాపారానికి సంబంధించి ఓ సాధారణ సూత్రం. దీన్నే సింపుల్ గా ప్రమోషన్స్ చేయడం అంటాం. ఇది సినిమాకు కాస్త ఎక్కువగా వర్తిస్తుంది. అసలే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న పరిశ్రమలో ప్రమోషన్ లేకుండా సినిమా రావడం అంటే ఆ నిర్మాత కష్టాన్ని సగం వరకూ గంగలో వేసినట్టే.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలను ముంచడానికి ఓ చంద్రుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటైన గిల్డ్ నుంచి చక్రం తిప్పుతోన్న ఆ చంద్రుడి వల్ల ప్రధానంగా చిన్న, మధ్య తరహా బడ్జెట్ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారు.

అతని వల్ల ఎందుకు నష్టపోతున్నారు అంటే.. ప్రమోషన్స్ ను అతను కంట్రోల్ చేస్తున్నాడు. ఏ నిర్మాతైనా తన శక్తికి తగ్గట్టుగా ఖర్చుపెట్టుకుని సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. కానీ ఆ చంద్రగ్రహణం ప్రమోషన్స్ ను కంట్రోల్ చేస్తూ.. వాటిని ఎలా చేయాలి.. అనే రూల్స్ తో చిన్న నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. దీనివల్ల కాస్త ఎక్కువ మందికి తెలియాల్సిన సినిమాలు తెలియకుండానే విడుదలవుతున్నాయి. అంతేకాక .. ప్రమోషన్స్ ను ఎలా చేయాలి.. ఎవరితో చేయాలి అనే విషయంలోనూ అతనే అంతిమ నిర్ణయం తీసుకుంటున్నాడు. పోనీ తనేమైనా అంత క్రియేటివ్ తోపా అంటే అంత సీన్ లేదు. ఆల్రెడీ మయూరి వంటి బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా ముంచేసే వచ్చాడు అంటారు. అసలు మినిమం క్రియేటివిటీ లేని ఐడియాస్ తో ప్రమోషన్స్ చేయమని చెప్పడం వల్ల అతను సినిమాకు మేలు చేస్తున్నట్టా కీడు చేస్తున్నట్టా అనేది గమనించాలి. ఇక రీసెంట్ గా వచ్చి రాజుగారి గది -3 టైమ్ లో దర్శకుడు ఓంకార్ కు అతను చుక్కలు చూపించాడు. చిన్న హోర్డింగ్ విషయంలోనూ మోనార్క్ లా వ్యవహరించాడు. అదే టైమ్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన విజయవంతంగా ఆడుతోన్న ఓ సినిమా విషయంలో రాజమండ్రి ఎఫ్ఎమ్ లో ప్రమోషన్స్ చేసుకుంటే మాత్రం కామ్ గా ఉండిపోయాడు. మరి ఇది ఎలాంటి ‘‘నీతి’’ అనేది అతనే చెప్పాలి.

ఎన్ని పోస్టర్స్ వేయాలో కూడా చెబితే ఇంక ఆ సినిమా ఆడియన్స్ కు చేరేదెలా..? ఇప్పటికే చిన్న సినిమాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు నిర్మాతల శ్రేయస్సే మాకు ముఖ్యం అనేవాళ్లు కూడా ఇంకా ఇబ్బందులకు గురి చేయడం.. పరిశ్రమకు మేలు జరిగేదిలా లేదని కొందరు నిర్మాతలు బాహాటంగానే వాపోతున్నారు. ప్రధానంగా ఆ చంద్రుడే ఈ గిల్డ్ కు గ్రహణంలా పట్టాడు అనేది అసలు విమర్శ.

ఈ గిల్డ్ ద్వారా నిర్మాతలకు బడ్జెట్ తగ్గిస్తాం అనేది మొదట్నుంచీ చేసిన ప్రచారార్భాటం. కానీ ఆచరణలో అది సినిమాకు బేసిక్ థింగ్ అయిన ప్రమోషన్స్ ను తగ్గించడంలో చూపించడం సిల్లీ థింగ్ కాక మరేమిటీ..? దీనివల్ల ఎంతో కష్టపడి రూపొందించిన సినిమాలు ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియకుండానే విడుదలవుతున్నాయి. దీంతో పెద్ద సినిమాల గురించి ఎలాగోలా తెలుసుకునే ప్రేక్షకులకు ఈ చిన్న సినిమాల సంగతి తెలియక అసలు వాళ్లు థియేటర్ వరకూ వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది నిర్మాతలే కదా..?

అసలు ప్రమోషన్స్ తగ్గించడం ద్వారా నిర్మాతలకు లాభం చేకూరుస్తాం అనే ఐడియానే బ్లండర్ మిస్టేక్. అలాంటి ఐడియాస్ ను ఆమోదించడం అంటే సినిమాను చంపడానికి ఓ ఆయుధాన్ని ఇచ్చినట్టే. ఇప్పటికే థియేటర్స్ ను కొందరి గుప్పిట్లో పెట్టుకుని సినిమాను సగం చంపేశారు. ఇప్పుడు ఉన్న సినిమాలకు ప్రమోషన్స్ చేయనీయకుండా మరింత సగం చంపేస్తున్నారు.

ఇక ఈ చంద్రగ్రహణం చేస్తోన్న ఆగడాలు గిల్డ్ పెద్దలకు తెలియవు అనుకోలేం. ఇప్పటికైనా ప్రమోషన్స్ లో పెట్టిన కండీషన్స్ ను మరోసారి సరిచేసుకుంటే మంచిది. ప్రతిదానికీ తామే తోపులం అని భావించకుండా ఇలాంటి విషయాల్లో కాస్త అన్నీ తెలిసిన మీడియా పెద్దలతోనూ సంప్రదింపులు జరిపి సినిమా పరిశ్రమకు ఇబ్బంది లేకుండా చేయొచ్చు. కానీ కొందరు అది తమకు నామోషీగా ఫీలవుతున్నారు.

ఏదేమైనా గిల్డ్ పేరుతో ప్రమోషన్స్ ను శాసిస్తూ.. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల ఊపిరి తీస్తోన్న ఈ వైనంపై పరిశ్రమ ప్రముఖులు, పెద్దలు కాస్త దృష్టిపెట్టాలి. పెద్ద సినిమానే ఇండస్ట్రీకి దిక్కు అనేది అసంబద్దం కదా. అన్ని సినిమాలూ ప్రేక్షకులకు చేరితే.. ఆ సినిమా కంటెంట్ ను బట్టి ఆడియన్స్ జయాపజయాలను నిర్ణయిస్తారు. వాళ్లు చెప్పే నిర్ణయానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా అడ్డుపడే ఇలాంటి చంద్రగ్రహణాలను తొలగించుకుంటే తప్ప.. ఇండస్ట్రీ బావుండదు. ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోకుంటే.. ఇలాంటి వాళ్లు మరింత మంది దాపురిస్తారు. తద్వారా పరిశ్రమను శాసిస్తారు.. చివరికి నాశనం చేస్తారు.. అలా జరగకుండా ఉండాలంటే పరిశ్రమ ప్రముఖులు, పెద్దలు కాస్త దృష్టిపెడితే మంచిది.

Next Story

RELATED STORIES