యుద్ధ రంగాన్ని తలపిస్తున్న అమరావతి గ్రామాలు

అమరావతి నుంచి రాజధానిని తలింపునకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అటు అమరావతి రాజధాని ప్రాంతం ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. రాజధాని తరిలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని రైతులు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో... ఆందోళనకు దిగిన రాజధాని రైతులు.. అమరావతిలోనే కేపిటల్ ఉంచాలంటూ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలతో మందడంలో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను ఇళ్లనుంచి బలవంతంగా అదుపులో తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నారు మహిళలు.
అటు సీఎం నివాసం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. మందడం గ్రామం లింకు రోడ్లు ముళ్ల కంచెలతో నిండిపోయింది. అటు సచివాలయానికి వెళ్లే మార్గాలు సైతం.. పోలీసులతో నిండిపోయింది. ఎక్కడిక్కడ పోలీసులను మోహరించి.. అనుమానం వచ్చినవారిని అదుపులో తీసుకుంటున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో యుద్ధవాతావరణం తలపిస్తోంది.
అమరావతితో పాటు గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. పెదకాకానిలో రైతులు, టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనకు దిగారు. నరసరావుపేటలో అఖిపలపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, వైసీపీ ఎమ్మల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.
నిన్నటి వరకు అమరావతికే పరిమితమైన ఆందోళన.. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పగలు నిరసన ర్యాలీలు, రాత్రి కాగడాల ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు ప్రజలు. శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో రైతులు, యువకులు రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపుతో.. మైనార్టీలకు, బలహీనవర్గాలకు సీఎం జగన్ మోసం చేశారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com