కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత

gand

హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్‌ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జెండా ఎగురవేసిన తర్వాత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తరువాత ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు కదలనీయలేదు. ఎలాంటి అనుమతి లేనందున ర్యాలీ చేపట్టొద్దని పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా మరో రూట్‌ను చూపించాలని కాంగ్రెస్‌ నేతలు కోరినా పోలీసులు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాటగా మారింది. వెంటనే కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీపీ అంజనీ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పార్టీ ఆఫీసులో సత్యాగ్రహదీక్ష చేస్తే.. వేల మంది పోలీసులతో తమ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. అంజనీ కుమార్‌ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంజనీ కుమార్‌ ఎక్కడ, ఎప్పుడు ఏం చేశాడో తెలుసన్నారు. ఆ చిట్టా అంతా గవర్నర్‌ ముందు ఉంచుతామన్నారు.

సీఎం కేసీఆర్‌, రాష్ట్ర పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్‌ యాత్రకు భయపడి అనుమతి ఇవ్వలేదన్నారు. ర్యాలీకి ఇబ్బంది లేని మార్గాన్ని ఇవ్వాలని పోలీసులను కోరినా అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గాంధీభవన్‌కు రాకుండా కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దారుణమని భట్టి మండిపడ్డారు.

తమ సత్యాగ్రహ దీక్షకు.. ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సీఎల్పీనేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎస్‌ఎస్‌, MIM సభకు అనుమతి ఇచ్చి తమకు అనుమతి ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story