మొన్నటిదాకా భ్రమరావతి అని కొత్త పల్లవి అందుకున్న వైసీపీ

మొన్నటిదాకా భ్రమరావతి అని కొత్త పల్లవి అందుకున్న వైసీపీ

ycp

మొన్నటిదాక భ్రమరావతి, గ్రాఫిక్స్, అక్కడ ఏమి లేవు అని ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా కొత్త పల్లవి అందుకుంది. అదే అమరావతికి లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని. అప్పుల రాష్ట్రం అంత భరించలేదంటూ మంత్రులు అంటున్నారు. లక్ష కోట్లు ఒక్క అమరావతిలో ఖర్చు పెట్టడం సాధ్యమా? అంత ఖర్చు అక్కడ అవసరమా? లక్ష కోట్ల ఖర్చుతో అమరావతిని నిర్మించడం బదులు.. 10 శాతం నిధులు పెడితే విశాఖలో హైదరాబాద్‌ను తలదన్నే రాజధాని అవుతుందని పదే పదే వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. రాజధాని మార్పునకు సిద్ధమైంది.

అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమించడం.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మంత్రి మాట్లాడినా లక్ష కోట్లు అన్న పదమే వినిపిస్తోంది. అసలు అమరావతికి లక్ష కోట్ల ఖర్చు వెనక నిజమేంటి? అమరావతిపై అసలు నిజం ఏంటి? ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏం చెప్తోంది?

అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి చంద్రబాబు ప్రభుత్వం.. ఫిబ్రవరి 2019లో జీవో 50ని విడుదల చేసింది. ఇందులో దేనికి ఎంత ఖర్చు చేశారు? రాబోయే రోజుల్లో ఎంత ఖర్చు చేయాలి? తీసుకురావాల్సిన అప్పు ఎంత? అమరావతికి భూముల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? అన్నదానిపై జీవోలో స్పష్టంగా వివరించారు.

ఆ జీవో ప్రకారం అమరావతి నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు 55 వేల 343 కోట్లుగా తెలిపారు. టైర్‌-1 మౌలిక వసతులకు 19 వేల 769 కోట్లు... టైర్-2 మౌలిక వసతుల కల్పనకు 17 వేల 910 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో 3 వేల 656 కోట్లు.. వివిధ రూపాల్లో తెచ్చుకున్న లోన్లకు, వడ్డీతో సహా అయ్యే ఖర్చు. అంటే అమరావతి నిర్మాణానికి అసలు ఖర్చు 51 వేల 687కోట్లు. ఇందులో ఏపీ ప్రభుత్వం 8 ఏళ్లలో పెట్టే ఖర్చు కేవలం 6 వేల 629 కోట్లు మాత్రమే. అలాగే సీఆర్డీఏ అప్పుగా మరో 5 వేల 971 కోట్లు ఇస్తుంది. ఇక వివిధ బ్యాంకుల నుంచి తీసుకోవాల్సిన లోన్లు 37 వేల 112 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. అమరావతి ప్రాజెక్ట్ మొత్తం 51 వేల 687కోట్లు మాత్రమే అని జీవోలో ఉంటే.. కేబినెట్‌ మీటింగ్‌లో మాత్రం లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందంటూ వైసీపీ సర్కార్‌ చర్చించడం విశేషం.

అమరావతి అనేది ఒ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని, అదో బంగారు గుడ్డు పెట్టే బాతు అని మొదటి నుంచి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. కానీ ఆ లాజిక్‌ను అర్థం చేసుకోవడంలో కొందరు విఫలం అవుతున్నారు. సీఆర్డీఏ దగ్గర భూమల లభ్యత 8 వేల 274 ఎకరాలు. మౌలిక వసతుల నిధుల కోసం 5 వేల 20 ఎకరాలు కేటాయించారు. రాజధాని ఆర్థిక అభివృద్ధి కోసం 3 వేల 254 ఎకరాలు కేటాయించారు. 2023 తర్వాత భూములను వాణిజ్య అవసరాల కోసం వాడనున్నారు. అలాగే రాబోయే 18ఏళ్లలో 3 వేల 709 ఎకరాలపై 78 వేల 563 కోట్ల ఆదాయం సమకూరనుంది. 18 ఏళ్ల తరువాత 1311 ఎకరాలపై 92 వేల 950 కోట్లు ఆదాయం రానుంది. అంటే భూముల ద్వారా సమకూరే మొత్తం ఆదాయం లక్షా 71 వేల 513 కోట్లన్న మాట. అలాగే ఇతర మార్గాల ద్వారా 14 వేల 641 కోట్లు అమరావతికి ఆదాయంగా లభించనుంది. అమరావతి ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయంతో పోల్చితే.. రాజధాని నిర్మాణానికి చేసే వ్యయం ఏమంత ఎక్కువకాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

మరి, ఎందుకు వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్చాలనుకుంటున్నది? అమరావతి నుంచి వైజాగ్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు? ఈ ప్రశ్నలకు సర్కారు సమాధానం నిధులు లేవని. లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని సాకుగా చెప్తోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది విష ప్రచారమని అంటోంది. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కడానికే వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని అంటున్నారు. ఇందుకు చంద్రబాబు హయాంలో విడుదల చేసిన జీవోలే నిదర్శనమని.. వైసీపీ దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టాలని నేతలు పిలుపునిచ్చారు.

టీడీపీ ప్రచారాన్ని వైసీపీ తప్పుపడుతోందని.. చంద్రబాబు చేసిన 5వేల కోట్ల అప్పుకే 500 కోట్ల వడ్డీ అవుతుందని.. మరి, లక్ష కోట్లు అప్పు తెస్తే వడ్డీ ఎంత అవుతుందని మంత్రులు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. వివాదాస్పదంగా మారిన రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజధాని పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌, ఇతర పరిపాలన భవనాలు వాడుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. లక్ష కోట్లు ఎందుకు అవసరమని వారి ప్రశ్న. కేవలం ఐదారు వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతినే రాజధానిగా కొనసాగించవచ్చని వారు అంటున్నారు.

ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మారుతుందా? పట్టింపులకు పోకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమరావతి రాజధానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story