రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషనర్‌

రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషనర్‌

ec-nagireddy

మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రచ్చ రచ్చ అయింది. కాంగ్రెస్‌ నేతలు సమావేశం నుంచి మధ్యలోనే వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. సమావేశం మొదలైన వెంటనే.. ఎన్నికల కమిషనర్‌తో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్‌రావు వాగ్వాదానికి దిగారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌లో మార్పులు చేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి విపక్షాల డిమాండ్లకు ఒప్పుకోలేదు. దీంతో ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలు వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.

రాజకీయ పార్టీలను పిలిచి నామమాత్రపు సమావేశం ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సమావేశం వల్ల ప్రయోజనం లేదన్నారు. తమ మాటలు వినేందుకు ఎన్నికల కమిషనర్‌ సిద్ధంగా లేరన్నారు. దురుసుగా మాట్లాడినందుకే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు మర్రిశశిధర్‌ రెడ్డి చెప్పారు.

ఇక బీసీల రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు తగ్గించి కుట్ర చేశారని లోక్‌సత్తా పార్టీ నేతలు ఆరోపించారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పినా ఎన్నికల కమిషనర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. అయితే, రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఖండించారు. ఎన్నికల కమిషన్‌తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story