తాజా వార్తలు

ట్విట్టర్‌ వేదికగా నెటిజన్ల ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు

ట్విట్టర్‌ వేదికగా నెటిజన్ల ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు
X

ktr

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి కేటీఆర్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారి సందేహాలను తీర్చే పని పెట్టుకున్నారు. ఆస్క్‌ కేటీఆర్‌ హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను మంత్రి కేటీఆర్‌ నెటిజన్లతో పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు.

తెలంగాణలో పౌర సవరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ-ముస్లిం కమ్యునల్‌ కార్డును వాడుతుందన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రజలను విభజించే ఎలాంటి అజెండా అయినా ఇక్కడి ప్రజలు ఎదుర్కొనేంత తెలివైన వారంటూ ట్విట్టర్‌లో సమాధానం చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. విద్య, వైద్యంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల విస్తరణపై దృష్టిసారించామని మంత్రి వివరించారు. నగరంలో సుమారు 50కి పైగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొంపల్లిలో ఐటీ పార్క్‌ కోసం భూసేకరణ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇతర నగరాలతో పోలిస్తే, హైదరాబాద్‌లో నీటి కొరత చాలా తక్కువగా ఉందని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌కు నీటి సమస్య తలెత్తదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించామని మంత్రి పేర్కొన్నారు. చార్మినార్‌, గోల్కొండ పర్యాటక క్షేత్రాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదన్న మంత్రి మెట్రోరైలును పాతబస్తీకి కూడా విస్తరిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనా మంత్రి కేటీఆర్‌ రియాక్టయ్యారు.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఆరు నెలల పాలన ఒక మంచి ప్రారంభమని అన్నారు.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మీ అభిప్రాయమేంటని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. మూడు రాజధానుల ఏర్పాటు మంచిదో కాదో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు ట్విట్టర్‌లో నెటిజన్స్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానాలిచ్చారు.

Next Story

RELATED STORIES