ఆంధ్రప్రదేశ్

సరళసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి

సరళసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి
X

sarala-projects

సరళసాగర్‌ ప్రాజెక్టుకు గండి పడడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇక్కడి నుంచి వస్తున్న వరద నీరంతా కొత్తపల్లి వాగు ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో.. ఆ డ్యామ్‌పై ఒత్తిడి పెరక్కుండా 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇప్పటికే కొత్తకోట-ఆత్మకూరు రహదారి కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఉంది సరళసాగర్‌ ప్రాజెక్టు. ఈ జలాశయంలోకి పూర్తిగా నీరు చేరడంతో నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం అర టీఎంసీయే. ఐతే.. ఓవైపు లీకేజీలు , మరోవైపు ఆటోమెటిక్ సైఫన్ గేట్లు తెరుచుకోకపోవడం వల్ల ఆనకట్ట ఎడమవైపు భారీ గండి పడింది. ఇదంతా పంట పొలాల్ని ముంచెత్తింది. పల్లపు ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పదేళ్ల తర్వాత సరళసాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. దీంతో అక్కడి రైతులు ఎంతో మురిసిపోయారు. కానీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గండి పడడంతో నీరు వృథాగా పోతోంది. గండి పూడ్చే పరిస్థితి లేకపోవడంతో నీరంతా బయటకు పోయి ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.

సరళాసాగర్ జలాశయం దేశంలోనే మొట్టమొదటి సైఫన్‌ సిస్టమ్‌ గల ప్రాజెక్టు. ఇక్కడ ప్రాజెక్టు పూర్తిగా నిండినప్పుడు ఆటోమేటిగ్గా గేట్లు తెరుచుకుంటాయి. నీరు దిగువకు వెళ్తుంది. కానీ గేట్లకు సకాలంలో మరమ్మతులు చేయని కారణంగా.. ప్రాజెక్టుపై ఒత్తిడిపెరిగి నీరు దిగువకు వెళ్లకపోవడం వల్ల గండి పడింది. నూతన టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ను సంబంధిత అధికారులు, ఇంజనీర్లు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరళాసాగర్ నుంచి నీరంతా రామన్‌పాడు చేరడంతో అక్కడ దాదాపు 8 వేల ఎకరాల పంట నీట మునిగింది. కొత్తపల్లివాగుతోపాటు ఊకచెట్టు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. అజ్జకొల్లు, మేడిపల్లి, రేచింతల, వీరరాఘవపురంలో పంటలు నీటిపాలయ్యాయి.

Next Story

RELATED STORIES