తాజా వార్తలు

ధూమపానం చేసేవారి జేబులు గుల్ల చేస్తున్న ఆ కలెక్టర్‌కి సలాం కొట్టాల్సిందే

ధూమపానం చేసేవారి జేబులు గుల్ల చేస్తున్న ఆ కలెక్టర్‌కి సలాం కొట్టాల్సిందే
X

smoking

సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగిరెట్‌ ప్యాకెట్‌ పైన రాసి ఉంటుంది. అయితే.. ఈ స్లోగన్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు. అనారోగ్యం పాలవుతూనే ఉన్నాడు. నేటి యువత.. సిగిరెట్‌ తాగుతూ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నామని భావిస్తుందే తప్ప తమ ఆరోగ్యాన్ని చేజేతులా చెడగొట్టుకుంటున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు. చాలా మంది ప్రాణాంతక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. యువత, విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగిరెట్‌ మోజులో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం ఎప్పుడో నిషేధించబడింది. కానీ.. అమల్లో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో.. ధూమపాన ప్రియులు రోడ్లపైన, హోటళ్ల దగ్గర, పాన్ డబ్బల వద్ద బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాము పొగ తాగడం వల్ల తమ ఆరోగ్యం మాత్రమే కాదు పక్కనున్నవాడి ఆరోగ్యం కూడ చెడగొడుతున్నామని ఆలోచించడం లేదు. ఈ క్రమంలో.. అధికార కార్యక్రమాలకు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్న సమయంలో ఈ ఘటనలు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌ రోజ్‌ కంటపడ్డాయి. దీంతో.. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఓ నిర్ణయానికొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిని పట్టుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేశారు. ఓ పోలీస్, ఓ సంక్షేమ శాఖ అధికారి, ఓ రెవెన్యూ శాఖ అధికారిని.. ఈటీమ్‌లో సభ్యులుగా నియమించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతూ ఎవరు కనిపించినా వెంటనే వారిని పట్టుకొని జరిమానా వేసి.. ఆతర్వాత వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

డిశంబర్‌ 6 వ తేదీ నుంచి ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్ ని రంగంలోకి దించి బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కలెక్టర్‌ దాడులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 70 మంది పొగరాయుళ్లకు జరిమానాలు విధించడం జరిగింది. ఒక్కొక్కరి నుంచి జరిమానా కింద రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో.. ధూమపాన ప్రియులు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగాలంటేనే వణికిపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతూ పట్టుబడిన వారు జరిమానా కట్టలేని స్థితిలో ఉంటే వారి చేత ఇంకెప్పుడూ బయట పొగతాగమని అమ్మా నాన్నల మీదనో, తోడబుట్టిన వాళ్ల మీదనో ప్రమాణం చేయిస్తున్నారు. దీంతో.. ఇదెక్కడి ప్రమాణాల గోలరా బాబూ అనుకుంటూ పొగరాయుళ్లు తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు ధూమపాన ప్రియులు తమకు జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశాల మేరకే జిల్లాలో తనిఖీలు చేసి రోడ్లపైన, ఓపెన్ ఏరియాలో పొగ తాగడం, గుట్కాలు తినడం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నిషేధం అనేది పాత మాట అయినా ఇప్పుడు కలెక్టర్‌ తీసుకున్న ఈ నిర్ణయం అందరికి కొత్తగా కనిపిస్తోంది. ఏదిఏమైనా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోజ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే.

Next Story

RELATED STORIES