ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కార్ అడుగులు ముందుకే..

మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కార్ అడుగులు ముందుకే..
X

Screenshot_1

మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కార్ అడుగులు ముందుకే వేస్తోంది. ఓవైపు రాజధాని తరలింపు పై పెద్దయెత్తున ఉద్యమాలు జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే ఫిక్సయినట్టుంది. దీనికి అనుగుణంగానే రాజధాని నిపుణుల కమిటీ కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ కూడా సానుకూలంగా నివేదిక అందించింది. ఇక రాజధానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సీఎం జగన్ కు శుక్రవారం తుది నివేదిక ఇవ్వనుంది.

అయినప్పటికీ.. రాజధాని తరలింపుపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో బీసీజీ నివేదిక పైన చర్చించనున్నారు. ఇక, జీఎన్ రావు కమిటీ, బీసీజీ గ్రూప్ నివేదికలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ రిపోర్టు పెండింగ్ లో వుంది. ఈ నెల 20 లోగా హైపవర్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి అందే అవకాశం కనిపిస్తోంది. ఇక, జనవరి 26 తరువాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రాజధాని అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశం పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పైన ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని పైన ఈనెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలావుంటే, రాజధాని తరలింపు అంశం పై రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. జీఎన్ రావు కమిటీతో పాటుగా బీసీజీ కమిటీ ఏర్పాటు.. అదే విధంగా హైపవర్ కమిటీ పైనా వారు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ల పైన విచారణను కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆ రోజు విచారణకే పరిమితం అవుతుందా..? లేక ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా అనే చర్చ సైతం ప్రభుత్వం లో నడుస్తోంది. దీంతో.. ఓవైపు రాజధాని తరలింపు పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పటికీ.. మరోవైపు హైపవర్ కమిటీ నివేదిక పూర్తికాకపోవడం, కోర్టు తీర్పు పెండింగ్ లో వున్న నేపథ్యంలో.. ఈ నెలాఖరుకు గానీ రాజధాని అంశంపై అంశంపై క్లారిటీ అవకాశం కనిపించడం లేదు.

ఇదిలావుంటే, శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో.. సకలజనుల సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. తుళ్లూరులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో జేఏసీగా ఏర్పడి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి సకలజనుల సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. నిత్యావసరాలు, ఎమర్జెన్సీ మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయాలని డిసైడయ్యారు. అంతేకాదు, కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా లేఖలు రాస్తున్నారు. దీంతో అమరావతి రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి అనుగుణంగానే నివేదిక ఇవ్వబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించనట్టుగానే బోస్టన్ గ్రూప్ కూడా రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందన్న విషయాన్ని నివేదికలో వెల్లడించబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదికల సంగతెలా ఉన్నా.. వైసీపీ నేతల మాటలు మాత్రం విశాఖలోనే రాజధాని ఏర్పాటు అంశాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తలపెట్టబోతున్న సకలజనుల సమ్మె ప్రభుత్వంపై ఎంత మేర ఒత్తిడి పెంచుతుందో వేచి చూడాలి.

Next Story

RELATED STORIES