అమరావతి జోలికొస్తే కాలిపోతారు - చంద్రబాబు

అమరావతి జోలికొస్తే కాలిపోతారు - చంద్రబాబు

bab

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకేస్తూ గత 15 రోజులుగా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాజధాని ప్రాంత రైతులు, వారి కుటుంబాలంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజధానిలో పర్యటించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం సభల్లో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఆనాడు ఒప్పుకుని ఇప్పుడెందుకు యూటర్న్‌ తీసుకున్నారని సీఎం జగన్‌ను నిలదీశారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడెందుకు మాట మార్చారని ఫైర్‌ అయ్యారు.

అమరావతిలో ఒకే సామాజిక వర్గం ఉందని ప్రచారం చేస్తున్నారని.. వెనుకబడిన కులాలు 75 శాతం ఉన్నాయన్నారు. ఏ సామాజిక వర్గం కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటే ఏంటో జగన్‌ చెప్పి నిరూపించాలని డిమాండ్‌ చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తనతోనే మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని.. తప్పు చేయలేదు కాబట్టే తాను భయపడడం లేదన్నారు.

కారుణ్య మరణాలు కావాలని రైతులు అడిగారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని ప్రాంత ప్రజలంతా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. అమరావతి జోలికొస్తే కాలిపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. విశాఖ ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రాజధాని కోసం పోరాడుతున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు.. బిర్యానీల కోసం వస్తున్నారని అవమానిస్తారా? అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని ఊళ్లకు రావడం తప్పా? అని నిలదీశారు. రైతులతో పాటు జైలుకు వచ్చేందుకు తాను కూడా సిద్ధమే అన్నారు.

రాజధాని తరలింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమరావతి ఐక్య వేదికకు టీడీపీ తరఫున లక్ష రూపాయలు చెక్‌ అందజేశారు. అమరావతి రైతుల ఉద్యమం కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన రెండు బంగారు గాజులను తీసి ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story