మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ కాంగ్రెస్

tcongress

మునిసిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజే.. నాగిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆ పార్టీ నేతలు. షెడ్యూల్ విడుదల చేసిన తీరుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్ల ఖరారు, నోటిఫికేషన్ కు మధ్య తక్కువ సమయం ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ తమ అభ్యంతరాలను వెలిబుచ్చారు. అయితే దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా స్పందించలేదు. దీంతో అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ నేతలు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనేది కాంగ్రెస్‌ ఆరోపణ. షెడ్యూల్ విడుదలకు కొద్ది గంటల ముందే టీఆర్‌ఎస్‌ నేతల వాట్సాప్ , ఫేస్‌బుక్‌లలో మున్సిపల్ షెడ్యూలు ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. రిజర్వేషన్ల ఖరారుకు నోటిఫికేషన్ జారికీ మధ్య తక్కువ వ్యవధి ఉండడం వల్ల కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం, అభ్యర్థిగా బరిలో దిగాలనుకున్న వ్యక్తి మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థలలో బకాయిలను చెల్లించడానికి తగిన సమయం అవసరమని.. ఇందుకోసం కనీసం వారం రోజులైనా వ్యవధి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ వేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు రానుంది. టిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా తాము మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని తామెప్పుడూ కోరలేదంటున్న హస్తం నేతలు.. రిజర్వేషన్లు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక వారం గడువు ఉండాలని కోరుతున్నామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు ఎన్నికల సంఘానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story