Top

వామ్మో..! తెలంగాణలో మందుబాబులు అంత లిక్కర్ తాగేశారా?

వామ్మో..! తెలంగాణలో మందుబాబులు అంత లిక్కర్ తాగేశారా?
X

drinkers

మందుబాబులు మత్తులో తూలారు.. మందేస్తూ చిందేశారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. 31 సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు చాలా చోట్ల మందు పార్టీలు కొనసాగాయి. భారీ సంఖ్యలో మందుబాబులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులకు చిక్కారు.

ఈ రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 378 కోట్ల రూపాయల విక్రయాలు జరిగాయి. బీరు, వైన్‌ కలిపి రాష్ట్రంలో రెండు రోజుల్లోనే 83.43 లక్షల లీటర్లు ఖాళీ అయ్యాయి. రోజువారీ అమ్మకాల కంటే డిసెంబరు 31వ తేదీ ఒక్కరోజే 150 శాతం ఎక్కువగా విక్రయాలు జరిగాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకూ రాష్ట్రంలో 2,050 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన సగటున రోజుకు 66 కోట్ల మందు అమ్మినట్టు లెక్కలు చెబుతున్నాయి.

రెండు రోజుల్లో విడివిడిగా చూసుకుంటే డిసెంబరు 30న 2.93 లక్షల కేసుల మద్యం, 2.97 లక్షల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. 31వ తేదీన 1.92 లక్షల కేసుల మద్యం, 2.15 లక్షల కేసుల బీర్ల కేసులు అమ్ముడిపోయాయి. లీటర్లలో చూస్తే.. రెండు రోజుల్లో రాష్ట్రంలో సుమారు 39.78 లక్షల లీటర్ల బీర్లు, 43.65 లక్షల లీటర్ల మద్యం తాగేశారు..

డిసెంబర్‌ 31 రాత్రి నుంచి అర్థరాత్రి వరకు నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఏకంగా 3,148 మంది మందుబాబులు చిక్కారు. రాష్ట్రవ్యాప్తంగా 29 యూనిట్లలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. డిసెంబరు 31న రాత్రి నుంచి ఈ తనిఖీలు కొనసాగాయి. డ్రంక్‌ డ్రైవ్‌లో మహిళలు కూడా భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. కేవలం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 951 మంది, సైబరాబాద్‌లో 873 మంది, రాచకొండలో 281 మంది దొరికారు.

Next Story

RELATED STORIES