చిన్ననీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

చిన్ననీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

Screenshot_1

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్‌డ్యాంలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో చిన్ననీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం... ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్‌ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలో లెక్కలు తీయాలని సూచించారు. అవసరమైన చెక్‌ డ్యాములను గుర్తించిన తర్వాత సగం ఈ ఏడాదే నిర్మించాలని.. దాని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలన్నారు. మిగతా సగం చెక్‌ డ్యాములను వచ్చే ఏడాది నిర్మించాలని వాటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించుకున్నామని... వాటి కట్టలు, తూములు, కాల్వలు మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాల. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి.

'కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా నీళ్లు వస్తాయి. గోదావరి నీళ్లతో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, ఎస్సారెస్పీ, మల్లన్న సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్లు నింపుకుంటాం. రాష్ట్రంలోని అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. తెలంగాణలో పుష్కలమైన పంటలు పండుతాయి. పడుబాటు నీళ్లు, వర్షపు నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. పడుబాటు నీళ్లు వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందకి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడిక్కడ ఆపడానికి చెక్‌డ్యాములు నిర్మించాలని' కేసీఆర్‌ ఆదేశించారు.

'ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్‌ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలో లెక్కలు తీయాలి. వ్యవసాయశాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీల సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించేలా చూడాలి'

'గతంలో మాదిరిగా నీరటికాడు వ్యవస్థను పునరుద్దరించాలి. వీఆర్‌ఏలకు ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో పెరిగే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీకి తరలించాలి. ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలి. అన్ని రిజర్వాయర్లను అక్టోబర్‌ నాటికి పూర్తిస్థాయిలో నింపాలి. మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదలశాఖను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలి. అందుకు తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలి. ఈఎన్సీలు తమ పరిధిలోని అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలి. భారీ, మధ్యతరహా, చిన్న అనే తేడా లేకుండా నీటిపారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని' సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story