తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ముఖ్య నేతల మధ్య కుమ్ములాట

తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ముఖ్య నేతల మధ్య కుమ్ములాటలకు మున్సిపల్ ఎన్నికలు వేదిక అవుతున్నాయి. మంచి ఫలితాలు రాబట్టాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసిన కొంత మంది సీనియర్లు దాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గెలుచుకో లేకపోయినా కనీసం గౌరవప్రదమైన సంఖ్యను సాధించి పార్టీ కేడర్లో ధైర్యం నింపాలి అన్నది పీసీసీ ఆలోచన. దానికోసం కలిసికట్టుగా పనిచేసి కారు స్పీడుకు బ్రేకులు వేసి మంచి ఫలితాలు రాబట్టాల్సిన పార్టీ సీనియర్లు .. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరు నాయకులకు పని విభజన చేసింది రాష్ట్ర పిసిసి. దీనికోసం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఈ కమిటీల నియామకం లో ప్రాధాన్యత అప్రధాన్యత అంటూ కొంత మంది సీనియర్లు ఉత్తంకుమార్ రెడ్డి పై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తమ జిల్లాల పరిధిలో తమను సంప్రదించకుండా ఎలా కమిటీల నియామకం చేస్తారు మండిపడుతున్నారు.

ముఖ్యంగా ఈ కమిటీల విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాజీ పిసిసి అధ్యక్షుడు లక్ష్మయ్య విహెచ్ లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తమ పరిధిలో ఉండే మున్సిపాలిటీలకు తమను కనీసం సంప్రదించకుండా ఎవరిని పడితే వారిని ఇన్చార్జిగా నియమిస్తే అక్కడ గెలుపోటములకు ఎవరు బాధ్యత వహిస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్న తమను కేవలం ఒక కార్పొరేషన్‌కు పరిమితం చేసి అక్కడ ఇంచార్జ్ గా నియమించి.. తమ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమిష్టి బాధ్యత అన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ,జానా రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఎందుకు కార్పొరేషన్ స్థాయి బాధ్యతలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. వారు రాష్ట్ర స్థాయి నాయకులు మేం మాత్రం కార్పొరేషన్ స్థాయి నాయకులమా అంటూ ఫైర్ అవుతున్నారు ఈ ముగ్గురు సీనియర్స్.

మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో పార్టీ ముఖ్య నేతలంతా యునైటెడ్ గా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలి కానీ .. అందుకు భిన్నంగా వ్యవహిస్తున్నారు. అధికార పార్టీని కట్టడి చేసేందుకు నేతలంతా కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి ఇలా ప్రతి అంశంపై .. కోడిగుడ్డుపై ఈకలు పీకడం విమర్శలకు తావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story