తాజా వార్తలు

ఒక్క మునిసిపాలిటి ఓడినా.. మంత్రి పదవులు పోతాయి: కేసీఆర్

ఒక్క మునిసిపాలిటి ఓడినా.. మంత్రి పదవులు పోతాయి: కేసీఆర్
X

cm-kcr

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సీనియర్లకు కేసీఆర్. దిశా నిర్దేశం చేశారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో అనేక సూచనలు, హెచ్చరికలు చేశారు. పురపోరులో పార్టీ ఏకపక్షంగా గెలవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని, సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ పోటీ అనే అపోహలు వద్దన్న ఆయన.. టీఆర్‌ఎస్‌కు ఎవరితోనూ పోటీ లేదన్నారు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు.

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఒక్క మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడినా మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారు. అధికారం తలకు ఎక్కించుకోవద్దంటూ హితబోద చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అతి విశ్వాసమే కొంపముంచిందని.. ఇప్పుడు విశ్వాసంతో పనిచేయాలన్నారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌కు బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఆశావహులు అధికంగా ఉంటారని.. పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేశాక ఆ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలన్నారు. గ్రూపు రాజకీయాలను సహించేది లేదని హెచ్చరించారు.

ఇక సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి మధ్య జరిగిన గొడవపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మీలో మీరు కీచులాడుకుంటే కార్యకర్తలు ఎలా కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జిల్లాల వారి సమావేశాలు నిర్వహించి ప్రచార వ్యూహాలను ఖరారు చేశారు. ప్రతి ఓటర్ ను కలవడం వల్ల హుజూర్‌ నగర్ ఉపఎన్నికను సునాయాసంగా గెలవగలిగామన్నారు. ఇదే వ్యూహాన్ని పురపోరులో అనుసరించాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే వారి రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్న సంకేతాలను కేసీఆర్ ఇవ్వడంతో నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటింగ్ రోజు వరకు నియోజకవర్గాల్లోనే తిష్ట వేసి గెలుపు భారాన్ని మోసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు సిద్దమవుతున్నారు.

Next Story

RELATED STORIES