అమెరికాకు డేంజర్ బెల్స్ మోగించిన ఇరాన్‌

అమెరికాకు డేంజర్ బెల్స్ మోగించిన ఇరాన్‌

iran-vs-us

యుద్ధ భేరీ మోగింది. వార్ సిగ్నల్స్ వచ్చేశాయ్. అమెరికాకు ఇరాన్‌ డేంజర్ బెల్స్ మోగించింది. సమరం తప్పదంటూ మసీదు నుంచి ఎర్రజెండా ఎగిరింది. రెడ్ ఫ్లాగ్ ఎగరడంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్-అమెరికాల యుద్ధ సన్నాహాలతో ఏం జరుగుతుందో అని గల్ఫ్ దేశాలు గడగడలాడిపోతున్నాయి.

ప్రతీకారం తప్పదు... శత్రువును హతమార్చాల్సిందే... దెబ్బకు దెబ్బ తీయాల్సిందే... ఇరాన్ హృదయస్పందన ఇది. యావత్ ఇరాన్ సమాజం కోరుకుంటున్నదీ ఇదే. ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదన కలగలసి ఇరానీయన్లను తీవ్ర భావావేశానికి గురి చేస్తున్నాయి. అందుకే శత్రువును తుదముట్టించాలని, అందుకోసం ఎంతకైనా తెగబడాలని తపించిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సమరానికి ఇరాన్ శంఖారావం మోగించింది.

ఇరాన్ ప్రతీకారానికి సిద్ధమైంది. అమెరికాపై యుద్ధానికి సై అంది. శషబిషలు.. నాన్చుడు ధోరణులు ఏమీ లేవు.. చాలా స్పష్టంగా సంకేతాలు పంపింది. అత్యంత పవిత్రమైన జంకారన్ మసీదు గుమ్మటంపై ఎర్రజెండా ఎగిరింది. ఇది అత్యంత అసాధారణం. శతాబ్దాలకు ఒకసారి కూడా ఇలా జరగదు. అత్యంత అరుదుగా, ఇక తప్పదు అనుకున్న సందర్భంలోనే ఇలా చేస్తారు. షియాల మత విశ్వాసం ప్రకారం ప్రార్థనా స్థలంపై ఎర్ర జెండా ఎగరవేయడం తీవ్ర హెచ్చరిక లాంటిది. అది ప్రతీకారానికి, యుద్ధానికి, శత్రు వినాశనానికి సిగ్నల్. ఇప్పుడు జంకారన్ మసీదుపై ఎర్రజెండాను ఎగురవేయడంతో ప్రతీకారానికి, శత్రు వినాశనానికి ఇరాన్ సిద్ధమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జంకారన్ మసీదు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వంద మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది షియాలకు అత్యంత పవిత్రమైనది. ఇరాన్ ఖుర్ద్స్ స్క్వాడ్ మిలటరీ జనరల్ ఖాసిం సులైమానీ మృతి నేపథ్యంలో జంకారన్ మసీదు గుమ్మటంపై ఎర్రజెండాను ఆవిష్కరించారు. మత ప్రార్థనల అనంతరం ఎర్రజెండాను గుమ్మటంపైకి తీసుకెళ్లి ఎగురవేశారు. రెడ్ ఫ్లాగ్ ఎగరడంతోనే వార్ బెల్స్ మోగినట్లైంది. అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధ సంకేతాలు పంపినట్లైంది.

ఖాసిం సులైమానీని అమెరికా హతమార్చింది. డ్రోన్ల దాడితో సులైమానీని చంపేసింది. ఐతే, ఆయన సాధారణ వ్యక్తి కాదు. షియాలకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా షియ వర్గంతో పాటు ఇతర వర్గాల్లోనూ పలుకుబడి ఉంది. ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియాల్లో ప్రభావం చూపిన లీడర్. అలాంటి నాయకున్ని కోల్పోవడంతో ఇరానీయన్లు పగతో రగిలిపోతున్నారు. అమెరికాను సాతానుగా అభివర్ణిస్తూ ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రతీకార జ్వాలకు ప్రతిరూపమే రెడ్ ఫ్లాగ్. అసాధారణ స్థాయిలో ఎర్రజెండా ఎగురవేశారంటే యావత్తు షియా సమాజం అమెరికాపై ఎలా కత్తులు నూరుతోందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ముస్లింల పతాకం హరిత పతాకం. ఎర్రజెండా ఎగురవేయడం అంటే యుద్ధానికి పిలుపునిచ్చినట్లు సంకేతం. అప్పుడెప్పుడో 680వ సంవత్సరంలో కర్బల యుద్ధ సమయంలో ఇమామ్ హుస్సేన్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఎర్రజెండా ఎగుర వేశారు. ఆ రెడ్ ఫ్లాగ్‌ను ఇప్పటికీ అవనతం చేయలేదు. అది షియా మతాచారం. ఇప్పుడు సులైమానీ మృతికి ప్రతీకారం తీర్చు కుంటామంటూ జంకారన్ మసీదుపై ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ లెక్కన అమెరికా-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇప్పట్లో వదిలివెళ్లే సూచనలు కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story