అల్లు అర్జున్ .. అందుకు ‘అల’ వేదిక కాదు

అల్లు అర్జున్ .. అందుకు ‘అల’ వేదిక కాదు
X

allu

అల్లు అర్జున్ .. స్టైలిష్ స్టార్ గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు ఉన్న హీరో. తెలుగులో టాప్ హీరోగా వెలుగుతోన్న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘అల వైకుఠపురములో’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతోంది. రిలీజ్ కు ముందు ఈ మూవీ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ కు మంచి స్పందన వచ్చింది.

కాకపోతే ఆ వేదికపై నుంచి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా ఫంక్షన్ లో సొంత విషయాలు ఎప్పుడో కానీ ప్రస్తావనకు రావు. ముఖ్యంగా ఆ సినిమా ఈవెంట్ ప్రధాన ఉద్దేశ్యం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలని.. ఆ విషయంలో దర్శక నిర్మాతలకు మించి నాన్నకు ప్రేమతో అంటూ అల్లు అర్జున్ చేసిన స్పీచ్ అసందర్భంగా మారిపోయింది.

'అల వైకుంఠపురములో' మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ‘‘35యేళ్లు గా మా నాన్న పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. సౌత్ తో పాటు దేశంలోనే నెంబర్ వన్ నిర్మాతగా ఉన్నారు.. తాత అల్లు రామలింగయ్యగారికి ఇచ్చినట్టుగా మా నాన్నకు కూడా పద్మశ్రీ ఇవ్వాలి’’ అంటూ అర్జున్ చేసిన ప్రతిపాదనకు అక్కడ ఉన్నవాళ్లే కాదు.. టీవిల్లో చూసిన వాళ్లు సైతం షాక్ అయ్యారు. నిజమే.. కొన్ని విషయాలు అడగాలన్నా.. లేదా కనీసం మాట్లాడాలన్నా అందుకు ప్రత్యేక వేదికలు, సందర్భాలూ ఉంటాయి. ఈ రెండూ కాని చోట నుంచి బన్నీ చేసిన పద్మశ్రీ ప్రతిపాదన పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది.

నిజానికి తెలుగులో నిర్మాతలకు పద్మశ్రీ అవార్డులు చాలా తక్కువగా వచ్చాయి. తొలితరం దర్శక నిర్మాత అయిన బిఎన్ రెడ్డితో పాటు మలితరం నిర్మాత డివిఎస్ రాజు వంటి వారికి పద్మశ్రీలు వరించాయి. ఇక శతాధిక చిత్ర నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషలన్నిటిలోనూ చిత్రాలు నిర్మించడం, స్టూడియో అధినేతగా పరిశ్రమ మనుగడలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ రామానాయుడుగారికి 2013లో పద్మభూషణ్ సత్కారం వరించింది. కానీ అల్లు అరవింద్ విషయానికి వస్తే ఆయనకు ఆ స్థాయి ఉందా అనే ప్రశ్న రావడమూ సహజమే.

నిజమే.. అల్లు అరవింద్ నిర్మాతగా కేవలం వ్యాపారాత్మక దృక్పథంతోనే సినిమాలు చేశారు. అలాగే సామాజిక సేవల్లోనూ ఎప్పుడూ ముందుగా కనిపించలేదు. పరిశ్రమ మనుగడలో ఆయన పాత్ర మరీ గొప్పదైతే కాదు.. అయినా ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి.. తనయుడుగా అల్లు అర్జున్ తండ్రికి అవార్డ్ ను ఆశించడం తప్పేమీ కాదు.. కానీ అందుకు వేదిక మాత్రం అల వైకుంఠపురములో కాదు..

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు వేదికపై సూపర్ స్టార్ కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాలని చెప్పాడు. ఆయన కోరిక సమంజసమే అయినా.. అది కూడా వేదిక కాదు. కృష్ణగారికి ప్రతిభకు నేరుగా ప్రతిపాదనలు పంపించొచ్చు. అందుకు పరిశ్రమ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటే సరిపోతుంది. అంతే కానీ అదైతే వేదిక కాదు.

నిజానికి ఇప్పటి వరకూ చెప్పుకున్న అందరికంటే కూడా ఇండస్ట్రీకి ఎక్కువగా భావించే లెజెండ్ దాసరి నారాయణరావుగారికే ఇంత వరకూ పద్మశ్రీ రాలేదు. దర్శకుడుగా, నిర్మాతగా, రచయితగా, రాజకీయ వేత్తగా, పత్రికాధిపతిగా.. సామాజిక వేత్తగా.. ఇలా ఎన్నో రంగాల్లో అద్భుతంగా రాణించిన దాసరి చేసిన సేవలు సామాన్యమైనవేం కాదు. అలాంటి వ్యక్తికే కేంద్ర ప్రభుత్వ పురస్కారం రాలేదు. అలాంటిది అల్లు అరవింద్ కు ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశ కాక మరేమవుతుంది..?

ఓ రకంగా దాసరి తలచుకుంటే ఆయన కాంగ్రెస్ కు చాలా దగ్గరగా ఉన్న టైమ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ లో ఉంది. అయినా ఆ వైపుగా ఆయన ఆలోచించలేదు. అటు ప్రభుత్వాలు కూడా దాసరిని సిఫారసు చేయలేదు. సరే కొన్నాళ్లు ఉండి ఉంటే చెప్పలేం కానీ.. దాసరితో పోలిస్తే ఇండస్ట్రీ ఎదుగుదలలో అల్లు అరవింద్ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువే. పొలిటీషియన్ గా కూడా సక్సెస్ కాలేదు అరవింద్.

ఇక ప్రతిభ గురించి కొలమానం కూడా అక్కర్లేదు. ఏదేమైనా అల్లు అర్జున్ కోరిక సమంజసమా కాదా అనేది పక్కన బెడితే అది వెలిబుచ్చిన వేదిక మాత్రం ఖచ్చితంగా అసందర్భం. కారణం ఏదైనా కొంత ఇబ్బందిగా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ అవార్డ్స్ కు అర్హత ఎంత ముఖ్యమో.. అవి అడిగే విధానం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Next Story

RELATED STORIES