రగిలిపోతున్న అమరావతి.. మందడం పోలీస్‌స్టేషన్‌కు మహిళా రైతుల తరలింపు..

రగిలిపోతున్న అమరావతి.. మందడం పోలీస్‌స్టేషన్‌కు మహిళా రైతుల తరలింపు..

bus-yatra

రాజధాని మార్పు అంశంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సుయాత్రలో పాల్గొనేందుకు తుళ్లూరు నుంచి వెళ్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు బయల్దేరిన బస్సులను సీజ్‌ చేశారు. మహిళలందరినీ మందడంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల తీరుపై మహిళలు భగ్గుమన్నారు. స్టేషన్‌లోనే వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ నిలదీశారు. డీఎస్పీ ఆఫీస్‌ ఎదుట బైఠాయించి.. రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై వాళ్లే దాడులు చేయించుకొని రైతులపై కేసులు పెట్టారని మహిళలు మండిపడ్డారు. పోలీసులు తమ నుంచి ఫోన్లు కూడా లాక్కొని దురుసుగా ప్రవర్తించారని ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ మండిపడ్డారు.

అంతకుముందు..విజయవాడలోనూ బస్సుయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బస్సుయాత్రకు సన్నాహాలు చేసింది జేఏసీ . అయితే.. ఈ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేశారు.. విజయవాడలోని గురునానక్‌ కాలనీలో బస్సుల్ని నిలిపివేశారు.

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది అమరావతి పరిరక్షణ సమితి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్రెడాయ్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story