Top

పాలమూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న మంత్రులు

పాలమూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న మంత్రులు
X

telangana-ministers

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటకుంటే.. సాగనంపుడేనన్న గులాబీ బాస్‌ వార్నింగ్‌ను ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ సవాల్‌గా తీసుకున్నారు. జిల్లాలోని 17 మున్సిపాల్టీల గెలుపు బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు టికెట్ల బాధ్యత అప్పగించిన కేసీఆర్.. గెలుపే ధ్యేయంగా అందర్నీ కలుపుకుపోవాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రులిద్దరూ.. తమ పరిధిలోని పట్టణాల్లో గెలుపు వ్యూహాలపై సీరియస్‌గా కసరత్తు మొదలుపెట్టారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 17 మున్సిపాల్టీల్లోనూ గులాబీ జెండా ఎగురవేసేందుకు మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ గట్టిగా పని చేస్తున్నారు. ఓ వైపు టికెట్ల కోసం ఆశావహుల పైరవీలు.. మరోవైపు పార్టీలో ముదురుతున్న వర్గ విభేదాలు వీరికి సవాల్‌గా మారాయి. రిజర్వేషన్ల అనూహ్య మార్పులతో ఆశావహుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో ఇప్పుడు అసంతృప్తులను బుజ్జగించడం.. వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం మినిస్టర్లకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల కన్నా.. అసంతృప్తుల నుంచే ప్రధాన సమస్య ఎదురవుతోంది. టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసేందుకు టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో వార్డు నుంచి నలుగురైదుగురు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐతే.. సీఎం కేసీఆర్‌ మాత్రం తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారికి... పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. దీంతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఐతే.. బి ఫామ్స్‌ ఇచ్చాక.. అసంతృప్తుల నిరసన జ్వాలను ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో ఉన్నారు మంత్రులు.

Next Story

RELATED STORIES