యుద్ధానికి సిద్ధమైన పందెంకోళ్లు.. డైలీ ఎక్సర్ సైజ్ లు, టైం ప్రకారం తిండి..

యుద్ధానికి సిద్ధమైన పందెంకోళ్లు.. డైలీ ఎక్సర్ సైజ్ లు, టైం ప్రకారం తిండి..

pandhm-kodi

రాజసం ఒలకబోస్తున్న పందెం కోళ్లు ఇవి. రాజభోగాన్ని తలపించే తిండి...సిక్స్ ప్యాక్ బాడీ. ఈ పందెం కోళ్ల జిందగీ గడియారం ముళ్లుతోనే ప్రయాణం ఉంటుంది. యుద్ధానికి సిద్ధమయ్యే ఓ సైనికుడిలా.. ఉదయం నుంచే రాత్రి వరకు ట్రైనింగ్ ఉంటుంది.

పందెంకోళ్లకు మహారాజు వైభోగాన్ని తలపించేలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే..పందెం నెల రోజులకు ముందు మాత్రం ట్రైనింగ్ పీరియడ్. డైలీ ఎక్సర్ సైజ్ లు, స్మిమ్మింగ్, టైం ప్రకారం తిండి..వార్మప్ మ్యాచ్ లతో వస్తాదులా తీర్చిదిద్దుతారు. సంక్రాంతి బరి కోసం పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే పందెం కోళ్లు ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోటీ సై అంటున్నాయి.

సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో కనిపించే సందడే వేరు. కోడి పందెం జోరు కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాలుగు రోజుల్లో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 150 కోట్లకుపైగా డబ్బులు పందాల్లో చేతులు మారతాయంటే కోడిపందాల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే సమరానికి సిద్ధం చేయడానికి ప్రత్యేక జాతులకు తర్ఫీదునిస్తారు. డేగ, కాకి, నెమలి... ఇలా ఎన్నో జాతులను ఎంపికచేస్తారు. అవి తినే ఆహారం నుంచి వాటి నివాసం, ఆరోగ్యం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. కోళ్ల కోసం ప్రత్యేకంగా ట్రైనర్లను నియమిస్తారు. ఉదయాన్నే కోడిపుంజుకు కోడిగుడ్డు సొన తాగించడం మొదలు... వ్యాయామం చేయించడం, కాళ్లతోపాటు శరీరం గట్టిపడేలా వాకింగ్, స్విమ్మింగ్ చేయించడం వరకు స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇక పందాల్లో గాయమైనా రక్తం కారకుండా ఉండేందుకు పుంజు శరీరం గట్టిపడేలా ఆవిరి పడతారు.

యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడిలా పందెపు కోళ్లకు ప్రత్యేక కాస్ట్‌లీ మెనూ పాటిస్తారు. పౌష్టికాహారం కోసం చోళ్లు, మినప్పప్పు, జీడిపప్పు, బాధం పప్పు గింజలు, నెయ్యితో కలిపి తయారుచేసిన ప్రత్యేక ఆహారాన్ని పెడతారు. వీటితోపాటు వేట మాంసం, మటన్ కైమాలను కూడా కోడిపుంజుల సామర్ధ్యాన్ని బట్టి తినిపిస్తుంటారు. ఒక్కో కోడికి 5 వేల నుంచి 50వేల వరకూ వెచ్చిస్తారు. వీటికి ఎలాంటి రోగాలు రాకుండా, ఆరోగ్యంగా ఉండేలా విటమిన్ మాత్రలు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్‌లు ఇస్తూ స్పెషల్ కేర్ తీసుకుంటారు.

పందెం కోళ్లకు శిక్షణ ఇవ్వడానికి పత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా పుట్టుకొచ్చాయి. వీటిలో ఒక్కో కోడికి శిక్షణ ఇవ్వడానికి 8 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేసి ఒకేసారి 200 కోళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సొంతంగా కోళ్లు పెంచలేని కొందరు పందెం రాయుళ్లు ఇక్కడే 50 వేల నుంచి 80 వేల వరకు చెల్లించి సెలెక్ట్ చేసుకుంటారు.

సంక్రాంతి సాంప్రదాయాల్లో ఒకటిగా వస్తున్న కోడి పందంపై నిషేధాన్ని ఎత్తివేయాలని పందెంరాయుళ్లు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు తరహాలోనే కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని అంటున్నారు.

అయితే.. కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ భీమవరం, వెంప, అయిభీమవరం, జువ్వలపాలెం, పాలకొల్లు, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, తణుకు, పరిసర ప్రాంతాల్లో పందాలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఇప్పటికే టెస్టింగ్ మ్యాచులు బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story