JNU లో దాడి ఘటన కీలక మలుపు

JNU లో దాడి ఘటన కీలక మలుపు

jnu

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దాడికి పాల్పడిన తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో జేఎన్‌యూ విద్యార్థి నేత అయిషీ ఘోష్ పాత్ర కూడా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమెకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటి వరకు .. దాడికి మీరంటే మీరు బాధ్యులు అని అటు వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇటు ఏబీవీపీ ఆరోపించుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్‌ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు జేఎన్ యూలోని సర్వర్ రూమ్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమైందన్నారు. దాడి ఘటనకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్ లను నమోదు చేశామన్న పోలీసులు.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని చెబుతున్నారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే.. చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు.

మరోవైపు.. జేఎన్ యూ దాడికి సంబంధించి పోలీసులు చేసిన ఆరోపణలను అయిషీ ఘోష్ ఖండించారు. తాను ఎలాంటి దాడికీ పాల్పడలేదని ఆమె అన్నారు. పోలీసులు కావాలనే విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ తనని ఇరికిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన రుజువులు తమ వద్ద ఉన్నాయన్నారు. చట్టం మీద పూర్తి నమ్మకం ఉందన్న అయిషీ... తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఐతే.. ఎటువంటి దాడికి పాల్పడకున్నా.. పోలీసులు ఇలా తననై ఎందుకు నేరం మోపుతున్నారని ప్రశ్నించారు.

అటు.. బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా ప‌దుకొణేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. సీఆర్పీఎఫ్ జవాన్‌ చనిపోయిన ప్రతిసారీ పండగచేసుకుంటోన్న వాళ్లకు...మీరు మద్దతు తెలుపుతున్నారనే విష‌యం మీకు తెలుసు. కొంత మంది అమ్మాయిలను వారి ప్రైవేట్ పార్ట్స్‌పై దాడిచేసిన వ్యక్తుల వెనుక తాను నిలబడుతున్నట్టు దీపికాకి కూడా తెలుసు. వాళ్లకు మద్దతుగా ఆమె నిలబడటం అనేది ఆమెకున్న హక్కు. అమ్మాయిలను కొట్టిన వ్యక్తుల వైపు నిలబడిన ఆమె హక్కును నేను ప్రశ్నించలేను అంటూ దీపికానుద్దేశించి ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ.

Tags

Read MoreRead Less
Next Story