ప్రతి ఇంటి నుంచి ఒకరు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలి : జేఏసీ నాయకులు

ప్రతి ఇంటి నుంచి ఒకరు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలి : జేఏసీ నాయకులు

amaravati

నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చి.. ఇప్పుడు రోడ్డునపడ్డ ప్రతి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న రాజమహేంద్రవరంలో, నిన్న తిరుపతిలో... జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జోలెపట్టి విరాళాలు సేకరించారు.

ఆదివారం నరసరావుపేటలో చంద్రబాబు పర్యటన సాగుతుంది. సాటి రైతుకు అన్యాయం జరిగినప్పుడు.. ఆదుకునేందుకు అన్నదాతలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని, ఉద్యమించాలని తిరుపతి సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోనేవరకు ప్రతి ఇంటి నుంచి ఒకరు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని గుంటూరు జిల్లా జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. నర్సరావుపేటలో జరిగే చంద్రబాబు పాదయాత్ర, సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి. పల్నాడు నుంచే కాకుండా.. జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, రైతులు, యువత తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజలు సంక్రాంతి పండగ చేసుకోలేని పరిస్థితి ముఖ్యమంత్రి కల్పించారని విమర్శించారు. ఏపీలో భయానక వాతావరణం నెలకొందన్నారు.

అమరావతే రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసుల దౌర్జన్యం, లాఠీచార్జి ఆపాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ చెప్తున్నా.. జగన్ ప్రభుత్వం వినే పరిస్థితి లేదని గుంటూరు జిల్లా జేఏసీ నేతలు విమర్శించారు. అర్ధరాత్రి పోలీసులు గోడలు దూకి రైతులను అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story